కేసీఆర్ కొత్త పార్టీ... హైదరాబాద్ వేదికగానే
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. త్వరలోనే హైదరాబాద్ వేదికగా కొత్త పార్టీని ప్రకటించనున్నారు
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. త్వరలోనే హైదరాబాద్ వేదికగా కొత్త పార్టీని ప్రకటిస్తారని తెలిసింది. భారత రాష్ట్ర సమితి పేరును ఖరారు చేయనున్నారు. వివిధ వర్గాలతో చర్చలు జరిపన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత కొన్నాళ్ల నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజలను ప్రశ్నిస్తున్న కేసీఆర్ ఇక పార్టీ ప్రకటించడమే ఆలస్యమని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఫ్రంట్.. పొత్తులు...
రైతులు, బడుగు బలహీనవర్గాల అజెండాగా ఈ పార్టీని కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొత్తపార్టీపై కేసీఆర్ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయనున్నారు. మేధావులు, రైతులతో ఆయన చర్చించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి బీజేపీయేతర పార్టీల నేతలను కలసి వచ్చారు. పార్టీ పెట్టిన తర్వాతనే ఫ్రంట్‌లు, పొత్తులు విషయం ఉంటాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 11న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ వస్తున్నారు. ఆ తర్వాతనే పార్టీ ప్రకటన ఉండే అవకాశముందని తెలిసింది.