ముందస్తు ఎన్నికలకు వెళ్లను.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Update: 2022-11-15 11:41 GMT

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి అధికారంలోకి రావాలని, దానిపై అందరూ దృష్టి పెట్టాలని కోరారు.

నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి..
ఈ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తాను కూడా జిల్లాల పర్యటనను చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలు సమన్వయం చేసేలా నియోజకవర్గానికి ఇక ఇన్‌చార్జిని నియమించనున్నానని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడవద్దని, వాటి పని అవి చేసుకుని వెళ్లనివ్వండని కోరారు.
మంత్రులతో చర్చించి...
అసెంబ్లీ ఎన్నికలను అందరూ ఇప్పటి నుంచే సీరియస్ గా తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. నియోజకవర్గాల సమస్యలను జిల్లా మంత్రులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప హైదరాబాద్ రావద్దని, ప్రజలకు అందుబాటులో నిత్యం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిత్యం పనిచేయాలని అన్నారు. మునుగోడులో గెలుపుపై అభినందన తీర్మానాన్ని ఈ సమావేశంలో చేశారు. అలాగే బీఆర్ఎస్ పై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని కేసీర్ నేతలకు తెలియజేశారు.


Tags:    

Similar News