11న కేసీఆర్ ఢిల్లీలో దీక్ష
ఏప్రిల్ 11వ తేదీన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ అధికార టీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చేసింది. రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ప్రారంభమవుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకూ ఉద్యమం ఆగదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ ఇదీ.....
ఏప్రిల్ నాలుగో తేదీన అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేయాలని కేటీఆర్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన తెలంగాణలో ఉన్న నాలుగు జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన జిల్లా కేంద్రాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలకు దిగుతారని కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయాలని, ప్రతి రైతు ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలపాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతారని చెప్పారు.