Telangana : రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. నెలాఖరు నుంచి నిధులు జమ
రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రైతు భరోసా నిధులను జమ చేయాలని నిర్ణయించారు;
రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రైతు భరోసా నిధులను జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నుంచి రైతుల ఖాతాల్లో విడతల వారీగా జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం అందుతుంది. రైతు భరోసా నిధులను ఈ నెలాఖరు నుంచి జమ చేయడం ప్రారంభించి డిసెంబరు నాటికి అందరి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలనిరేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
హామీల అమలులో భాగంగా...
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలో భాగంగా రేవంత్ రెడ్డి మరో గ్యారంటీని అమలులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసానిధులు ఇంత వరకూ జమచేయక పోవడంపై ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ విమర్శలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్అయ్యారు. ఇందుకోసం కసరత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతు భరోసా నిధులపై నియమించిన కేంద్ర మంత్రి వర్గ ఉప సంఘంతో కూడా చర్చించారు. వారిచ్చిన సిఫార్సులు, సూచనలు మేరకు రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున రైతులందరికీ ఈ భరోసా నిధులను అందచేయాలని నిర్ణయించారు.
అర్హులైన వారికే...
అయితే రైతు భరోసా నిధులను అందరికీ ఇవ్వరు. కేవలం భూమిని సాగు చేస్తున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అందుతాయి. ఎకరా నుంచి ప్రారంభించి తొలుత ఎకరా, తర్వాత రెండు ఎకరాలు, తర్వాత ఐదు ఎకరాల్లోపు వారికి, అనంతరం పది ఎకరాల్లోపు వారి వరకు మాత్రమే రైతుభరోసా నిధులను జమ చేయనున్నారు. పది ఎకరాలు పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు అందే అవకాశమే లేదు. ఎందుకంటే పది ఎకరాలు భూమి ఉంటే రైతు పేద కాదు. పేద వారికి మాత్రమే రైతు భరోసా నిధులు అందించాలన్న నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు నికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు...
ఈ నెలాఖరు నుంచి వచ్చే నెలాఖరులోపు పూర్తిస్థాయిలో అందరికీ రైతు భరోసా నిధులను జమ చేయాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. తాము అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి పూర్తి చేశామని చెప్పడానికి వీలవుతుంది. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో రాజకీయ కారణాలు కూడా రైతు భరోసా నిధులను జమ చేయడం వెంటనే ప్రారంభించాలని నిర్ణయించడానికి ఒక కారణంగా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే రైతుభరోసా నిధులు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమై వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకోసం నిధుల సమీకరణ దిశగా ప్రయత్నాలను అధికారులు కసరత్తును ప్రారంభించారని తెలిసింది.