Revanth Reddy : నేడు నల్లగొండ వాసులకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నల్లగొండలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా నల్లగొండ వాసులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. నల్లగొండ వాసులకు సంబంధించిన ప్రధానంగా మూసీ ప్రాజెక్టు సుందరీకరణపై ఈరో్జు రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. మూసీ నది కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇప్పటికే ఆ జిల్లాల్లోని రైతులు, ప్రజల్లో కొంత ఆందోళన ప్రారంభమయింది.
నల్లగొండ జిల్లా నుంచి సానుకూలత...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం తీసుకున్న తర్వాత నల్లగొండ జిల్లా నుంచి పెద్దయెత్తున అనుకూలత కనిపించింది. రైతులు మూసీ నది కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇబ్బందులన్నీ ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తెచ్చినా ప్రయోజనం లేదు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూసీ నది ప్రక్షాళన చేపడతానని ప్రకటించడంతో ఎక్కువ సంతోషించింది నల్లగొండ జిల్లా ప్రజలే. మూసీ కాలుష్యం నుంచి తమకు విముక్తి లభిస్తుందని భావించారు. అందుకోసమే రేవంత్ చేసిన ఈ ప్రతిపాదనను నల్లగొండ జిల్లా రైతులు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి తమకు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడేయాలని కోరుతున్నారు.
ప్రత్యేక ప్రకటన చేస్తారా?
రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజునాడు నల్లగొండ జిల్లాలోని మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర కూడా చేపట్టారు. నాడు రైతులకు హామీ ఇచ్చారు. మూసీనది ప్రక్షాళనకు కొన్ని వందలకోట్ల అవసరమైనా అందుకు సిద్ధమని తెలిపారు. మంత్రుల బృందం సియోల్ వెళ్లి అక్కడ పరిశీలన కూడా చేసి వచ్చింది. మూసీ నది ప్రక్షాళన కోసం దాదాపు పదివేల భవనాలను తొలగించాల్సి ఉంది. అయితే న్యాయపరమైన చిక్కులతో కొంత ఆగింది. దీంతో పాటు వారికి పరిహారంగా ప్రభుత్వం రెండు వందల చదరపు గజాల స్థలం ఇవ్వాలని కూడా భావిస్తుంది. మూసీ ప్రక్షాళన చేయడం తధ్యమని, తద్వారా హైదారాబాద్ నగరంలో పర్యాటక రంగం అభివృద్ధి చెంది రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిపెట్టడమే కాకుండా, హైదరాబాద్ కు వరద నీటి ముప్ప కూడా తప్పుతుంది. నల్లగొండ వాసులకు కూడా మూసీ ప్రక్షాళనతో భారీ ఊరట లభిస్తుంది. అందుకనే నేటి నల్లగొండ సభలో మూసీ నది ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.