తెలంగాణ పోలీసులకు రేవంత్ డెడ్ లైన్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు డెడ్ లైన్ పెట్టారు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల్లోగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నెల16వ తేదీ 12 గంటల వరకూ రేవంత్ తెలంగాణ పోలీసులకు డెడ్ లైన్ పెట్టారు. 16వ తేదీ 12 గంటల్లోపు అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈనెల 16న....
రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దాడి కాదని, మహిళలపై చేసిన దాడి అని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పోలీసులను తమ విధులను సక్రమంగా నిర్వహించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. తాను స్వయంగా ఈ నెల 16వ తేదీన తెలంగాణలోని అన్ని పోలీసు కమిషనరేట్ లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
మహిళ కమిషన్ కు....
తాను ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈనెల 18 వ తేదీన కాంగ్రెస్ మహిళ నేతలు రేణుక చౌదరి, గీతారెడ్డి నాయకత్వంలో మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.