గోల్కొండ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు;
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
వాళ్ల ఖర్మదినం....
పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం విపక్ష నేతలకు జైలు దినం కావాలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి కేటీఆర్ తన తండ్రికి జన్మదిన కానుకగా అందివ్వాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ జన్మదినం నిరుద్యోగుల ఖర్మదినం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులందరూ మెగా నోటిఫికేషన్ ను డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.