Telangana : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్... సాయంత్రం స్నాక్స్
తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సాయంకాలం స్నాక్స్ అందించనుంది.;

తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సాయంకాలం స్నాక్స్ అందించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూళ్లలో చదివే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తరగతులు హాజరవుతున్న విద్యార్థులు త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావడానికి అల్పాహారం అందివ్వాలని నిర్ణయించింది.
స్పెషల్ క్లాసులు జరుగుతున్నందున...
ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తీర్ణతా శాతం పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ను పదో తరగతి విద్యార్థులకు తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో నిర్వహిస్తుున్నారు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వారు సాయంత్రం ఆకలితో ఇబ్బంది పడకుండాదాదాపు 34రోజుల పాటు అల్పాహారం అందివ్వాలని నిర్ణయించింది.
ఇదీ మెనూ...
అల్పాహారం కింద ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లతో పాటు ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడక పెట్టిన శనగలు.. ఇలా రోజుకు ఒక రకం స్నాక్స్ ను పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు. దీనివల్ల విద్యార్థులు బలంగానూ తయారై పరీక్షలకు సన్నద్ధలయ్యేందుకు అవసరమైన శక్తిని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం పదిహేను రూపాయల వరకూ ఖర్చు చేయనుంది.