Raithu Bharosa : గుడ్ న్యూస్.. రైతుభరోసా గైడ్ లైన్స్ ఇవే.. విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాన ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. విధివిధానాలను విడుదల చేసింది;

Update: 2025-01-12 04:22 GMT

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ రైతు భరోసా నిధులకు సంబంధించి వారికి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. త్వరలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఇప్పటి వరకూ అనేక రకాలుగా రైతు భరోసా నిధుల విడుదలపై ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టివేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

భూభారతిలో నమోదయిన...
భూభారతిలో నమోదయిన వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ నుంచి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పడంతో తొలి విడత కింద ఆరు వేల రూపాయల నిధులను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దాదాపు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పడంతో ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది.
వాటికి మాత్రం లేదు...
సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రం ఈ పథకం వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. భూ విస్తీర్ణం ఆధారంగా రైతులకు ఈ పథకాన్ని వర్తిస్తారు. గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. సాగు చేయకపోయినా అది వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే మాత్రం రైతు భరోసా నిధులు అందుతాయని పేర్కొంది. అంటే గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వారికి అందరికీ ఈ పథకం వర్తిస్తుందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించడానికి కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్లే పూర్తిగా విచారించి పథకం అమలుకు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags:    

Similar News