ఏపీకి బ‌కాయి ప‌డ్డ ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే

దీంతో తెలంగాణ స‌ర్కారు తెలంగాణ‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. బ‌కాయిల చెల్లింపుల‌ను నిలుపుదల చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Update: 2022-09-28 09:00 GMT

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న విద్యుత్ బ‌కాయిల చెల్లింపు వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి బ‌కాయి ప‌డ్డ ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్ప‌టికిప్పుడు ఏపీకి తెలంగాణ స‌ర్కారు విద్యుత్ బ‌కాయిల‌ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదని చెప్పింది. బ‌కాయిల చెల్లింపుపై స్టే ఎత్తివేశాక తెలంగాణ స‌ర్కారు ఈ బిల్లుల‌ను చెల్లించాల్సి ఉంటుంది. విభజన జరిగిన త‌ర్వాత తెలంగాణ నుంచి బొగ్గును తీసుకున్న ఏపీ... అందుకు ప్ర‌తిగా విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసింది.బొగ్గు బ‌కాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కోర‌గా... త‌మ విద్యుత్‌ను తీసుకున్న కార‌ణంగా ఆ బ‌కాయిల‌ను చెల్లించాలంటూ ఏపీ వాద‌న‌కు దిగింది. ఈ వ్య‌వ‌హారం కేంద్రం వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఇరు రాష్ట్రాల వాద‌న‌లు విన్న కేంద్రం తెలంగాణనే ఏపీకి రూ.6,995 కోట్ల విద్యుత్ బ‌కాయి ప‌డిందని తేల్చింది. ఈ బ‌కాయిల‌ను చెల్లించాల‌ని తెలంగాణ‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ స‌ర్కారు తెలంగాణ‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. బ‌కాయిల చెల్లింపుల‌ను నిలుపుదల చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తెలంగాణ హైకోర్టు ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బ‌కాయిల‌పై స్టే విధించింది.


Tags:    

Similar News