ఉగాది తర్వాత మరింత ఉధృతం చేస్తాం
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు.;
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానిది లేకి మనస్తత్వంగా ఆయన అభివర్ణించారు. ధాన్యం కొనమంటే కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు కూడా రైతుల పక్షాన నిలబడటం లేదని చెప్పారు. పైగా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పోరాటం ఆగదు....
యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విషం కక్కే కార్యక్రమాన్నే బీజేపీ నేతలు పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో యాసంగిలో పండే ధాన్యం బాయిల్డ్ రైస్ గానే పనికొస్తుందని చెప్పారు. ఆ విషయం ఎంత చెప్పినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీల నుంచి జడ్పీ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేస్తూ ప్రధానికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగాది తర్వాత ఆందోళనలను ఉధృతం చేస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు.