బెంగళూరుకు 'పాలేరు' పంచాయతీ.. ఒకే సీటు కోసం ముగ్గురు

తెలంగాణలో రాజకీయం మరింతగా ముదురుతోంది. ఒకరి టికెట్‌ ఇస్తే ఇంకోకరికి కోపం.. మరొకరేమో అసంతృప్తి ఇలా రకరకాల రాజకీయాలు..

Update: 2023-09-02 05:39 GMT

తెలంగాణలో రాజకీయం మరింతగా ముదురుతోంది. ఒకరి టికెట్‌ ఇస్తే ఇంకోకరికి కోపం.. మరొకరేమో అసంతృప్తి ఇలా రకరకాల రాజకీయాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరేమో ఓ పార్టీకి అధ్యక్షురాలు.. పాలేరు సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో పార్టీ విలీనం కోసం సిద్ధమవుతున్నారు.. మరొకరెమో పాలేరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నాయి. మరొకరేమో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పాలేరు సీటుపై మాత్రం కన్నేశారు. సీటు ఒక్కటే.. కానీ పోటీకి మాత్రమే ముగ్గురు. తాజా పరిణామాలను చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఖమ్మం జిల్లా పాలేరు సీటు కీలకంగా మారింది. ఈ సీటు కోసం…షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పాలేరు సీటు కోసం మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల, ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ఇక కొన్ని తనకు, తన అనుచరులకు కొన్ని సీట్లు ఇవ్వాలని, ముందే క్లారిటీతో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిపి పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాలేరు నుంచే పోటీకి సిద్ధమంటున్నారు. ఇక ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్ ఆశించి, భంగపడిన మరో నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌లో చేరి, పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ పాలేరు టికెట్ల పంచాయతీ ఇప్పుడు బెంగళూరుకు చేరింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన డీకే శివకుమార్‌ దగ్గరికి పాలేరు పంచాయతీ చేరింది. అటు షర్మిల, ఇటు తుమ్మలతో వరుస భేటీలతో డీకే శివకుమార్ బిజీ అయ్యారు. ఇంతకీ.. పాలేరు టిక్కెట్‌ను ఎవరికిస్తారనే దానిపైనే సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఓ వైపు షర్మిల డీకే శివకుమార్‌తో భేటీ అయి, పాలేరు విషయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరడంతో, ఏకంగా ఈ పంచాయితీ డీకే దగ్గరికి చేరింది. ఆయనతో రేవంత్‌, తుమ్మల భేటీ తర్వాత దీనిపై అధిష్ఠానంతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుమ్మలకు స్పష్టమైన హామీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక పాలేరుపై క్లారిటీ వస్తే తుమ్మల త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయతే పాలేరు సీటు కోసం ముగ్గురి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News