ప్రాజెక్టులకు జలకళ.. ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు చేరితే.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తామని..

Update: 2023-07-20 06:29 GMT

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరికి భారీఎత్తున వరద నీరు వస్తుండటంతో.. భద్రాచలం వద్ద నది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు చేరితే.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తామని అధికారులు తెలిపారు. గోదావరికి వరద తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలో 5 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే.. మొదటిప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఇలా..

కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,38,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 4,85,000 ఉంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 33,050 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1046 క్యూసెక్కులు ఉండగా.. సింగూరు ప్రాజెక్టులోకి 4,674 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అధికారులు 415 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 14,140 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,900 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 642.25 అడుగులుగా ఉంది. అధికారులు గేట్లు ఎత్తి 996 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరొచ్చి చేరుతోంది. అధికారులు 6 గేట్లు ఎత్తి 9వేల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు ఉంది. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని కెనాల్ ల ద్వారా చెరువులకు నీటిని వదులుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News