తెలంగాణ వాసులకు అలర్ట్..
రాజధాని హైదరాబాద్ లో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో కొన్నిప్రాంతాల్లో..
వారంరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కొన్నిప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి, వర్షాలు కురుస్తుంటే.. మరికొన్నిప్రాంతాల్లో మాత్రం విపరీతమైన ఉక్కపోతతో.. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణ వాసులను హెచ్చరిస్తూ వాతావరణంపై ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీలు కూడా నమోదు కావొచ్చునని పేర్కొంది.
రాజధాని హైదరాబాద్ లో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక సోమవారం (మే29) రాష్ట్రంలో ఎండలు సెగలుకక్కాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.