తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రెండ్రోజులు వర్షాలు
అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, పొడి వాతావరణం ఉంటుందని ..
ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వేసవిలో అనుకోకుండా వర్షాలు కురవడం.. అదే సమయంలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణకేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాలో భారీ వర్షంతో పాటు వడగండ్లు కూడా పడొచ్చని పేర్కొంది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావతంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించిన వివరాల మేరకు వికారాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు వడగండ్లు కూడా పడొచ్చని అధికారులు తెలిపారు. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది వాతగావరణ శాఖ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పగటిపూట ఉష్ణోగ్రతలు 34-38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనూ పలు చోట్ల వర్షం ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.