Weather Report : ఎన్నాళ్లకు గుర్తొచ్చేమే వాన.. తడిసి ముద్దయిన నగరం
ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి;

ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో పిడుగులు కూడా పడ్డాయి. కాగా ఈరోజు, రుపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల భారీ వర్షం నమోదయింది. అయితే ఈదురుగాలులు కూడా కొన్ని చోట్ల వీచాయి.
అధిక ఉష్ణోగ్రతలతో...
నిన్నటి వరకూ 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు నిన్నటి నుంచి కురిసిన వర్షంతో కొంత ప్రజలు ఊరట చెందారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. అకాల వర్షంతో ప్రజలు అక్కడక్కడా ఇబ్బంది పడినా వేసవిలో ఈ రకమైన వర్షం ప్రజల్లో ఆనందాన్ని నింపింది. పలు చోట్ల వృక్షలు నేలకొరగాయి. అనేక ప్రాంతాల్లో బోర్డులు కూడా కింద పడ్డాయి. అయితే ఎటువంటి ప్రమాదం జరిగినట్లు మాత్రం వార్తలు అందలేదు. వర్షం కురియడంతో ప్రజలు ఉదయం నుంచి బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం...
రాత్రి వర్షం కురియడంతో హైదరాబాద్ నగరంలో పలు చో్ట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకూ విద్యుత్తు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు సరఫరా చిన్న పాటి వర్షానికే అంతరాయం కలగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మరో రెండు రోజుల తర్వాత ఈ వర్షం దెబ్బకు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందన్న ఆందోళన మాత్రం అందరిలోనూ కనపడుతుంది.