Telangana : ఏడాది గడుస్తున్నా మంత్రి వర్గాన్ని విస్తరించరా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తుంది. మంత్రి వర్గ విస్తరణ ఇప్పటి వరకూ చేపట్టలేదు

Update: 2024-10-18 12:16 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తుంది. అంటే మరో రెండు నెలలు గడిస్తే ఏడాది పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. దీంతో ఆశావాహుల్లో నిరాశ ఏర్పడింది. ఏడాది గడుస్తున్నా తమకు మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తి వారిలో నెలకొని ఉంది. అయితే మంత్రి వర్గ విస్తరణ అనేది రాష్ట్ర నేతల చేతుల్లో మాత్రం లేదన్నది అందరికీ తెలిసిన నిజమే. ఎందుకంటే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలనుకున్నా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే అందింది.

నిరాశ, నిస్పృహలో...
అంతకు ముందు మంచి రోజులు లేవన్నారు. తర్వాత దసరా పండగనాడు అన్నారు. అన్నీ అయిపోయాయి. ఇక సంక్రాంతి మాత్రమే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ మాత్రం చేపట్టలేదు. ఇప్పటికే అనేక మంది నేతలు తమకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందన్న ఆశతో గాంధీ భవన్ లో ఉన్న పీసీసీ చీఫ్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి తమ మనసులో మాటను చెబుతున్నారు. కానీ ఇక్కడి నేతలు నిస్సహాయులగానే చెప్పాలి. వారు కూడా తాము ఏమీ చేయలేమని చెబుతుండటంతో నిస్సహాయంగా వెనుదిరిగుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామని వాపోతున్నారు.
ఆరు స్థానాలు...
తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కొందరు సీనియర్ నేతలు తమను పక్కనపెట్టడం పై కినుక వహించారు. వారంతా సమయం మించి పోతున్నా ఏడాది గడుస్తున్నా ఇంకా విస్తరణ జరగకపోవడంతో నీరుగారిపోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొనడం లేదు. తమకు అన్యాయం జరిగిందన్న ధోరణిలో వారంతా ఉన్నారు. వీరిని సముదాయించడానికి రాష్ట్ర స్థాయి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల వరకూ తాము వెయిట్ చేశామని, ఇంకా సాగదీయడం ఎందుకంటూ కొందరు నిలదీసే పరిస్థితికి వచ్చిందంటే అసహనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత....?
కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అన్న టాక్ వినపడుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు, అనుకున్న స్థాయిలో రాకపోవడంతో హైకమాండ్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే ఏడాదికి మించి మంత్రి పదవుల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి వర్గ విస్తరణ జరిపి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి ఆయన ఆలోచనకు ఢిల్లీ హైకమాండ్ ఏ మేరకు అనుకూలంగా స్పందిస్తుందన్నది చూడాలి మరి. ఎంత కాలం సాగదీస్తారో చూడాలి.


Tags:    

Similar News