తెలంగాణలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మరణించాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన

Update: 2022-09-28 09:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మరణించాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన కొమ్ము సతీష్ అనే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 33 సంవత్సరాలు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పిడుగు పాటుకు గురై మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న సతీష్ గ్రామ శివారులోని తన వరి పొలంలో కలుపు తీస్తున్నాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 29న (గురువారం) ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాధారణ వానలు.. మిగతా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. సెప్టెంబర్ 30న (శుక్రవారం) నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.


Tags:    

Similar News