'గమ్యం' యాప్.. ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సాంకేతికతను అందిపుచ్చుకుని

Update: 2023-08-12 10:30 GMT

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యే దిశ‌గా మరో ముందుడుగు వేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ కు ‘గమ్యం’ గా నామకరణం చేసింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. యాప్ ప్రయోజనాలను వివరిస్తూ.. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో.. ఎప్పుడొస్తుందో.. అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించామ‌ని తెలిపారు. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని వెల్ల‌డించారు. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడిందని పేర్కొన్నారు. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నామ‌ని తెలిపారు.

‘గమ్యం’ యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయని.. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చని వివ‌రించారు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు.



Tags:    

Similar News