శభాష్.. ఏపీ డ్రైవర్‌కి సజ్జనార్ అభినందనలు
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ వీరబాబుని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. ఆయన చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ సంస్థ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సంస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు కొత్త కొత్త స్కీములు కూడా ప్రవేశపెట్టారు. అలాగే ప్రయాణికుల సౌకర్యాల విషయంలోనూ రాజీపడలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఎంత కష్టమొచ్చినా ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే సిబ్బందిని అభినందించడంలో కూడా ముందుంటానని నిరూపించుకున్నారు. అది కూడా పొరుగు రాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌ని కావడం విశేషం.
అసని తుఫాన్ ఏపీలో విరుచుకుపడుతోంది. భారీ వర్షం.. ఈదురుగాలుల ధాటికి ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌కి పెద్ద కష్టమొచ్చి పడింది. హఠాత్తుగా బస్సు ముందున్న పెద్ద అద్దం ఊడి పడిపోయింది. అసలే తుఫాను.. ఈదురుగాలుల హోరుకి అద్దం పడిపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో భయం నెలకొంది. అంతా కేకలు వేయడం మొదలుపెట్టారు. అయినా మొక్కవోని ధైర్యంతో డ్రైవర్ వ్యవహరించినీ తీరు అబ్బురపరిచింది. భయపడకుండా.. ధైర్యంగా బస్సును గమ్యస్థానానికి చేర్చి శభాష్ అనిపించుకున్నాడు కాకినాడ డిపోకి చెందిన డ్రైవర్ వీరబాబు.
విజయవాడ నుంచి కాకినాడకు ప్రయాణికులతో బయలుదేరాడు. రావులపాలెం గౌతమి వంతెన వద్దకు రాగానే ఈదురుగాలులకు బస్సు ముందున్న పెద్ద అద్దం ఊడిపోయింది. బస్సులోకి గాలులు, వర్షం రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. అయినా ధైర్యంగా బస్సును ముందుకు పోనిచ్చి ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చాడు. ఆ విషయం తెలుసుకున్న టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించేందుకు హద్దులు అవసరం లేదన్నారు. కాకినాడ డ్రైవర్ వీరబాబుని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ప్రశంసించారు. అద్దం ఊడిపోయినా బస్సు నడిపిన డ్రైవర్ ఫొటోను ట్వీట్ చేస్తూ అభినందనలు తెలియజేశారు.