Telangana : హమ్యయ్య.. వాతావరణం చల్లబడింది...ఇక బతికి బయటపడినట్లేనా?

వాతావరణం చల్లబడింది. వర్షాలు మొదలయ్యాయి. జూన్ మొదటి వారంలోనే కొంత ప్రజలకు ఉపశమనం లభించింది.

Update: 2024-06-03 02:05 GMT

వాతావరణం చల్లబడింది. వర్షాలు మొదలయ్యాయి. జూన్ మొదటి వారంలోనే కొంత ప్రజలకు ఉపశమనం లభించింది. మండే ఎండలతో అలమటించి పోతున్న ప్రజలకు నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు కొంత ఊరట కల్గిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు గత నెల 31వ తేదీన కేరళలో ప్రవేశించాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కూడా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక మీదుగా రాయలసీమలోకి రుతుపవనాలు విస్తరించడంతో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

వర్షాలు మొదలయ్యాయి..
తెలంగాణలోనూ నిన్న ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈరోజు ఉదయం నుంచి చల్లని వాతావరణం ప్రజలను పలుకరించింది. ఈ నెల 6వ తేదీ తర్వాత తెలంగాణను రుతుపవనాలను తాకే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ మూడు రోజులు ముందుగానే వాతావరణం చల్లబడింది. రోహిణి కార్తెలో బయటకు వెళ్లాలంటే జనం భయపడిపోయారు. చిరు వ్యాపారులు కూడా ఇబ్బంది పడ్డారు. అనేక మంది వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు.
మరో మూడు రోజులు
ఈ నెల 6వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశముందని తెలిసినా మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో కొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక ఎండలు దాదాపుగా తొలగిపోయినట్లే. భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు మాత్రం లేవని వాతావరణ శాఖ అధికారులు తీపి కబరు అందించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.



Tags:    

Similar News