తెలంగాణలో మళ్లీ వానలు ఎప్పుడంటే?
బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయింది. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు జనం. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు లేవని ప్రకటన చేశారు. వచ్చే వారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అంతే తప్ప ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శనివారం నుంచి వర్షాలు తగ్గుతాయని, వాతావరణం సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల వరకు అధికారులు ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశాలో విస్తరించిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అన్నారు. ఆగస్టు రెండో వారం నుంచి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెప్పింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిశాలోని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని అన్నారు. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలో కూడా ప్రస్తుతానికి భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.