నాడు తిరుపతి.. నేడు యాదాద్రి.. క్యూ కాంప్లెక్స్ లోకి చేరిన వర్షపునీరు
బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ధాటికి ..
యాదాద్రి : గతేడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో భారీ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ఇప్పటికీ మర్చిపోలేం. ఆ భీకర దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఘాట్ రోడ్లు సహా.. శ్రీవారి మెట్లమార్గం సైతం ధ్వంసమైంది. ఆ పీడకల నుంచి తిరుపతి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా.. తిరుపతిలో జరిగిన వర్ష బీభత్సం.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలోనూ జరిగింది.
బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ధాటికి చలువ పందిళ్లు కూలిపోగా.. ఆలయం క్యూ కాంప్లెక్స్ లోకి వర్షపునీరు చేరింది. ప్రసాద విక్రయ కేంద్రంలోకి వరదనీరు వచ్చింది. ఆలయానికి వెళ్లే మూడవ ఘాట్ రోడ్డు భారీ వర్షానికి ధ్వంసమవ్వడంతో.. కొండపైకి వాహనాలను నిలిపివేశారు అధికారులు. దాంతో భక్తులు నడకదారిలో ఆలయానికి వెళ్తున్నారు. ధ్వంసమైన ఘాట్ రోడ్డును ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారు. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి శ్రీలక్ష్మీ నృసింహుడి ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ వరద నీరు చేరింది. వరద నీరు గుట్టపై నుంచి కిందకు జాలువారడంతో కిందనున్న కాలనీలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట బస్టాండ్ ఆవరణాన్ని వరదనీరు ముంచెత్తింది.