ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి : షర్మిల

తాజాగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా..

Update: 2022-04-30 08:57 GMT

కొత్తగూడెం : నిన్న హైదరాబాద్ హెచ్ఐసీసీ లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొని.. ఏపీ పరిస్థితులపై తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగింది. ఏపీ ప్రతిపక్షాలు కేటీఆర్ అన్న మాటల్లో తప్పులేదని చెప్పగా.. వైసీపీ మంత్రులు మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక్కడికొచ్చి చూస్తే.. ఏపీ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందని మండిపడ్డారు.

తాజాగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ముందు మనం చక్కగా ఉండి పక్క రాష్ట్రాన్ని అంటే బాగుంటుందని విమర్శించారు. మనమే సరిగ్గా లేనపుడు పక్కవారిమీద పడి ఏడిస్తే ఏం లాభమని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, కేటీఆర్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మీకు ఫ్రెండ్స్ ఉండి ఉంటే.. ఇక్కడి సమస్యలు కూడా తెలిసేవన్నారు. ఆంధ్రాలోనే కేటీఆర్ కు ఫ్రెండ్స్ ఉన్నారంటూ షర్మిల ఎద్దేవా చేశారు. పక్కరాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలన్న ఆమె.. మీ పాలనలో తెలంగాణ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ‌లోనే ప‌రిస్థితులు బాగోలేక‌పోతే ఇప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దేశాన్ని ఏల‌తామ‌ని చెప్పుకుంటున్నార‌ని దుయ్యబట్టారు.



Tags:    

Similar News