ఒక్క ట్వీట్ తో.. పార్టీ విలీనం వార్తలకు బ్రేక్

తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని, ఊహాజనిత ప్రచారాన్ని..

Update: 2023-06-23 11:48 GMT

ys sharmila

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తామని పేర్కొంటున్న ఆమె.. ఇప్పటికే రాష్ట్రంలో పాదయాత్ర చేసి.. తెలంగాణ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇటీవల ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అవ్వగా.. అప్పటి నుండి వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అస్వస్థతకు గురవ్వగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ చేసి తెలుసుకున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో పార్టీ విలీనం ప్రచారం మరింత జోరుగా సాగింది.

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేసిన ఓ ట్వీట్ ఆ ప్రచారానికి బ్రేక్ వేసింది. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని, ఊహాజనిత ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొన్నారు. "వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ" అని షర్మిల ట్వీట్ చేశారు. దీంతో వైఎస్సార్టీపీ విలీనం వార్తలకు బ్రేక్ పడింది.


Tags:    

Similar News