రిస్క్ అయినా సరే.. మూడ్ ఛేంజ్ చేద్దాం
సంక్రాంతి తర్వాత చంద్రబాబు మరింత దూకుడు పెంచనున్నారు. జిల్లాల పర్యటనలతో హోరెత్తించనున్నారు;
సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరింత దూకుడు పెంచనున్నారు. జిల్లాల పర్యటనలతో హోరెత్తించనున్నారు. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో ముందుగానే అన్ని జిల్లాలను చుట్టి వచ్చి పార్టీ క్యాడర్ ను కార్మోనుఖులను చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి వరకూ కొన్ని జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు జిల్లాకు మూడు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పర్యటించి వచ్చారు. అయితే కందుకూరు, గుంటూరు ఘటనల తర్వాత చంద్రబాబును అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తారు. కుప్పంలో పోలీసులు అడ్డుకోవడంతో కుప్పంలో క్యాడర్ లో కసి రగిలింది. కుప్పం తరహాలోనే అన్ని ప్రాంతాల్లో క్యాడర్ లో వేడి పుట్టించాలంటే పర్యటనలు వేగవంతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
పోలీసులు అడ్డుకుంటే...
జీవో నెంబరు వన్ ను బూచిగా చూపించి తనను అడ్డుకుంటే కేవలం క్యాడర్ లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ సానుభూతి లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడకకు వెళ్లాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి వేగవంతం చేయాలని నిర్ణయించారు. పండగ సమయం కాబట్టి తర్వాత పర్యటనలను వేగవంతం చేయాలని భావించారు. తమ మిత్రపక్షమైన వామపక్షాలను, జనసేన వంటి పార్టీల మద్దతును కూడగట్టవచ్చని, జిల్లాల్లో తమ బలం ఏంటో మిత్రపక్షాలకు కూడా చూపించవచ్చన భావనలో చంద్రబాబు ఉన్నారు. ఎంత రచ్చ అయితే అంత మంచిదని చంద్రబాబు అనుకుంటున్నారు.
సీమ, ఉత్తరాంధ్రలలో...
అందుకే రాయలసీమలో పార్టీ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న చంద్రబాబు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ పర్యటనలు చేయాల్సి ఉంటుందని ఆయనకు అందిన వివిధ నివేదికల ద్వారా తెలిసింది. ఇప్పటికే కర్నూలు పర్యటన సక్సెస్ అయిందని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. అందుకే మరింతగా సీమలో పర్యటించాలని, అలాగే ఉత్తరాంధ్రలో కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ఒకసారి చుట్టి రావాలని చంద్రబాబు రెడీ అవుతున్నారు. తనను దమ్ముకుంటే అడ్డుకోవాలని సవాల్ విసరనున్నారు. పోలీసులు అడ్డుకున్నా అది పార్టీకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే పర్యటనల ద్వారా కొంత ఛేంజ్ ను, పార్టీ క్యాడర్ లో మూడ్ ను మార్చేయాలని సిద్ధమవుతున్నారు.
లోకేష్ పర్యటన కూడా...
ఒకవైపు ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర లోకేష్ ప్రయాణం చేస్తున్నారు. కుప్పం నుంచి లోకేష్ పర్యటన ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్యాడర్ లో జోష్ నింపడానికి చంద్రబాబు యాత్రలు ఉపయోగపడతాయి. లోకేష్ యాత్రకు కూడా ఎక్కువ మంది పాల్గొనేలా నేతలను కూడా అప్రమత్తం చేేసే వీలుంది. అందుకే చంద్రబాబు సంక్రాంతి పండగ తర్వాత జిల్లాల పర్యటనలతో మరింత జోరు పెంచుతారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. రెండు మూడు రోజుల్లోనే ఆయన టూర్ షెడ్యూల్ ను విడుదల చేస్తామని పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం మీద చంద్రబాబు పర్యటనలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.