"షా" నిర్ణయం తుస్సుమంటుందా?

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని అమిత్ షా తిరుపతి ీమీటింగ్ లో చెప్పి వెళ్లిపోయారు.

Update: 2021-11-21 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అగ్రనేత అమిత్ షా అంచనాలు తలకిందులవుతాయా? ఆయన మిగిలిన రాష్ట్రాల్లో అనుసరించిన తీరు ఏపీలోనూ చూపాలనుకోవడం కరెక్టేనా? ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని అమిత్ షా తిరుపతి ీమీటింగ్ లో చెప్పి వెళ్లిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంటే ఏపీలో టీడీపీ నుంచి మాత్రమే. ఏ ఇతర పార్టీల నుంచి బీజేపీలో పెద్దగా చేరలేదు. అంటే టీడీపీ నుంచి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది షా ఉద్దేశ్యం.

ఇతర పార్టీల నేతలకు....
ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా పార్టీ బలపడింది. పశ్చిమ బెంగాల్ ను తీసుకుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీనే ఓడించగలిగింది. సువేందు అధికారి లాంటి నేతలు రావడంతో ఓటు బ్యాంకు పెరిగింది. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల కారణంగా అనేక నియోజకవర్గాల్లో బీజేపీ బలపడిందన్నది అమిత్ షా ఆలోచన. అందుకే ఏపీలోనూ బీజేపీ లోకి వచ్చిన ఇతర పార్టీల నేతలను గౌరవించాలని చెప్పి ఉండవచ్చు.
బలం లేని నేతలను...
కానీ ఆయనకు తెలియని విషయమేమిటంటే ఇక్కడ పార్టీలో చేరిన నేతలు ఒకరిద్దరు మినహా ఎవరికీ వ్యక్తిగతంగా బలం లేదు. ఇమేజ్ లేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లు ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. అలాగే వారికి ప్రజలతో సంబంధాలు కూడా పెద్దగా లేవు. ప్రజలను ఆకట్టుకునే చరిష్మా కూడా లేదు. టీజీ వెంకటేష్, ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి లాంటి వాళ్లు మాత్రమే కొంత బలం ఉన్న నేతలు. అయితే వీరికి ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా బీజేపీ ఏపీలో పెద్దగా బలపడేది లేదు.
ఎవరు వస్తారు?
అమిత్ షా సూచనలతోనే ఇప్పుడు అందరూ కలసి అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా బీజేపీలో చేరడానికి ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారు? నిన్నమొన్నటి దాకా టీడీపీ నుంచి పెద్దయెత్తున నేతలు వస్తారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంతో టీడీపీ ఏపీలో మరింత బలపడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆదేశాల ప్రకారం ఆపరేషన్ ఆకర్ష్ తుస్సు మంటుందనే చెప్పాలి. ఇతర ఏ పార్టీ నుంచి నేతలు వచ్చే అవకాశాలు లేవు. అమిత్ షా ఏపీలో వేసుకున్న అంచనాలు తారుమారుకానున్నాయి.


Tags:    

Similar News