రెండేళ్లలో సెట్ చేస్తారా? అప్ సెట్ అవుతారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో పార్టీని రాష్ట్రంలో సెట్ చేసుకోవాలి;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో పార్టీని రాష్ట్రంలో సెట్ చేసుకోవాలి. అదే సమయంలో రాష్ట్రాన్ని కూడా గాడిలో పెట్టాలి. తాను ఇచ్చిన హామీలను గ్రౌండ్ చేయగలగాలి. ఇవన్నీ సాధ్యమవుతాయా? ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ వేసిన శిలాఫలకాలకు మోక్షం లభిస్తుందా? మరి వాటిని పూర్తి చేయకుండానే జగన్ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందా? అంటే ఏమో కాదని మాత్రం అనలేం. జగన్ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన వచ్చే పుట్టినరోజుకు వీటిలో కొన్ని హామీలనయినా నెరవేర్చాల్సి ఉంటుంది.
ఆర్థిక పరిస్థితిపై...
ఎందుకంటే జగన్ ఇచ్చిన హామీలు, చేసిన శంకుస్థాపనలకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. దశలవారీగా వీటిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల చివరి ఏడాది పూర్తిగా ఎన్నికల ఫీవర్ ఉంటుంది. ఇక మిగిలింది ఏడాది మాత్రమే. మూడు రాజధానుల అంశం ఈ రెండేళ్లలో కొలిక్కి వస్తుందన్న నమ్మకం లేదు. న్యాయస్థానాలతో పోరాటం చేయాలి. అలాగే విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయడానికి ఈ సమయం సరిపోదు.
శంకుస్థాపనలు చేసి...
ఇక కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపన చేసి దాదాపు ఏడాది కావస్తుంది. మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు వంటి వారికి శంకుస్థాపనలు చేశారు. కానీ వాటికి నిధులు లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎన్నికల సమయంలోగా వీటిలో కనీసం పురోగతి కన్పించాలి. ఇక పోలవరం ఎన్నికల సమాయానికి పూర్తయ్యే ఛాన్సు మాత్రం ఉంది. అలాగే జిల్లాల విభజన కూడా జరగాల్సి ఉంది.
ఎన్నెన్నో హామీలు....
ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అది కూడా పురోగతిలోనే ఉంది. జనగణన పూర్తయితే తప్ప అది సాధ్యం కాదంటున్నారు. ఇలా జగన్ ఆర్థికపరంగా ముడి పడి ఉన్న అనేక అంశాలను జగన్ ఎన్నికలకు ముందు పరిష్కరించుకోవాల్సి ఉంది. అప్పుడే జగన్ పై జనం నమ్మకం పెట్టుకుంటారు. లేకుంటే పక్కన పెడతారు.