పీకల్లోతు కష్టాల్లో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేయాలి.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మరో వైపు ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించాలి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడం అంత సులువు కాదు. దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోలేని పరిస్థితి జగన్ ప్రభుత్వానిది. మరోవైపు కరోనా పరిస్థితులు, వరదలు ఇలా జగన్ ను అన్ని రకాలుగా పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాయనే చెప్పాలి.
కరోనా దెబ్బకు....
జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఏడిది నుంచే కరోనా ప్రారంభమయింది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. మరోవైపు సంక్షేమ పథకాలను ఖచ్చితంగా చెప్పిన సమయానికి అమలు చేయాలి. ఇలా దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్ల రూపాయలను ఒక్క సంక్షేమ పథకాలకే జగన్ వెచ్చించాల్సి వచ్చింది. ఏ పథకాన్ని ఆపలేదు. ఇదే సమయంలో వరదలు ముంచెత్తాయి.
వరదలతో ....
వరదల వల్ల దాదాపు ఆరువేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సాయం వస్తుందో తెలియదు. కానీ తిరిగి కోలుకోవాలంటే, అక్కడ పూర్వ పరిస్థితులను నెలకొల్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఈ క్లిష్ట సమయంలోనే ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబరు 1 నుంచి కార్యాచరణను కూడా ప్రకటించాయి.
ఇప్పుడు సాధ్యమేనా?
ఉద్యోగ సంఘాలు గత రెండున్నరేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ వల్ల వందల కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. అలాగే సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలను ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిష్కరించలేరు. అందుకు ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదు. దీంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకుంటుందా? లేక వారిని పక్కన పెడుతుందా? అన్నది చూడాల్సి ఉంది.