స్వచ్ఛమైన సీమ రాజకీయం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్ట్రయిట్ పాలిటిక్స్ చేస్తారు. ఏదీ మనసులో దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్ట్రయిట్ పాలిటిక్స్ చేస్తారు. ఏదీ మనసులో దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. రాజకీయాల్లో ఒక్కోసారి ఇది ఇబ్బందిగా మారుతుంది. అయినా సరే.. జగన్ తన పద్ధతిని మార్చుకోరు. తొలి నుంచి అంతే. డొంక తిరుగుడు ఉండదు. చెప్పాల్సింది మొహం మీదే చెప్పేస్తారు. తాను చేయబోయేది కూడా చెబుతారు. అందుకే భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను ఆయన పట్టించుకోరు. అలాగని భయపడరు. వ్యాపారంలో సక్సెస్ అయిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. అదే ఆయనకు తరచూ చిక్కులు తెచ్చిపెడుతుంది. ఒకరనుకుంటారని నిర్ణయం వెనక్కు తీసుకోరు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే మొండి జీవి జగన్.
ఎన్నికలున్నాయని తెలిసినా...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ కోల్పోవడానికి కారణం జగన్ వ్యవహారశైలి అని చెప్పకతప్పదు. మార్చి నెలలలో ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికలు జరుగుతాయని ఏడాది ముందే తెలుసు. అయినా ఆయన ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. వారితో నేరుగా మాట్లాడి ఈ ఎన్నికల వరకూ వారు తమకు అనుకూలంగా ఓటేసేంత వరకూ ఓపిక పట్టొచ్చు. భరించ వచ్చు. కానీ ఆ ఓపిక జగన్ కు లేదు. ఆ రెండు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించి వారిద్దరినీ దూరం చేసుకున్నారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిక్కెట్ నీదే అని ఒక మాట చెప్పొచ్చు. అన్నా ఎమ్మెల్సీ ఇస్తా అని అనడం రాజకీయం అనిపించుకోదు. అలాగే ఉండవల్లి శ్రీదేవికి కూడా తాడికొండ నుంచి మరొకచోట మారుస్తానని చెప్పడం కూడా జగన్ మొండితనానికి నిదర్శనం. ఈ విషయాలు వారే బయటకు వచ్చి చెప్పినవి. అలా ఉంటుంది జగన్ తోటి.
భిన్నమైన రాజకీయం...
జగన్ తాను నమ్మిన వ్యక్తికి ఎలాగైనా అవకాశాలు ఇస్తారు. అదే నచ్చకపోతే దగ్గరకు కూడా రానివ్వరు. చంద్రబాబు రాజకీయానికి పూర్తిగా భిన్నమైన రాజకీయం. ఫక్తు రాయలసీమ రాజకీయం. చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు పుట్టినా ఆయన పాలిటిక్స్ వేరు. చివరి నిమిషం వరకూ ఎవరికీ టిక్కెట్ ఇవ్వరని చెప్పరు. జాబితా వెలువడే వరకూ వారికి తెలియకుండా జాగ్రత్త పడతారు. తర్వాత హామీలు ఇస్తారు. కానీ అవి అమలులోకి రావు. అప్పటి అవసరం తీరిపోతుంది. అది ఆయన తీరు. ఇది ఈయన తీరు. ఇద్దరూ మార్చుకోరు. అందుకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సయితం జగన్ ను నమ్ముకుని ఉన్నవారు ఎక్కువ మందే ఉన్నారంటారు. అంతెందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జగన్ కేసులో జైలుకు వెళ్లి వచ్చి చిక్కి శల్యమైనా, అధికారంలోకి రాగానే ఏపీలోకి పరుగులు పెట్టారు. అందుకే జగన్ ను దగ్గరగా చూసిన నేతలు, అధికారులు ఆయనను అంత తేలిగ్గా వదిలిపెట్టరు.
స్ట్రయిటి పాలిటిక్స్....
చంద్రబాబుది వేరే రూటు. ఆ అవసరం అంత వరకే. ఇది చంద్రబాబును విమర్శించడం కాదు కానీ ఆ నైజమదే. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు నడవగలిగినా, ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికైనా అలాంటి వైఖరే కారణం. ఒకసారి ఛీ కొట్టినా దగ్గరకు తీసుకుంటారు. చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తాను 2014లో అధికారంలో ఉండగా తీసుకుని తర్వాత వారి ఎక్కువ మందికి సీట్లు కూడా ఇవ్వలేదు. వారి రాజకీయ భవిష్యత్ ఇబ్బంది పాలయినా సరే ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. కానీ జగన్ అలా కాదు. తన వెంట నడిచిన వారికి పదవులు ఇవ్వందే వదలిపెట్టరు. కాస్త ఆలస్యం కావచ్చు కానీ పదవులు గ్యారంటీ అన్న ధైర్యం వారికి ఉంటుంది. మొత్తం మీద జగన్ చేసే స్ట్రయిట్ పాలిటిక్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంపముంచాయని వైసీపీ నేతలు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.