జనసేనాని పై జగన్ ఫైర్.. ఆ బూతులేంటి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలోకి వెళ్లారో చూశామని, వీధి రౌడీలుగా మారిపోయారన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లు మన నేతలా? అని అనిపిస్తుందన్నారు. దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏమని మాట్లాడిస్తున్నాడో మనం అంతా చూస్తున్నామన్నారు. ఏం చేయలేని, ఏమీ చేయని వాళ్లు బూతులు తిడుతున్నారన్నారు. మూడు రాజధానుల వల్ల న్యాయం జరుగుతుందని మనం భావిస్తుంటే, మూడు పెళ్లిళ్ల వల్లనే మేలు జరుగుతుందని మీరూ చేసుకోండని మాట్లాడే వాళ్లున్నారని జగన్ అన్నారు. ఇలాంటి వాళ్లా మన నాయకులా? అని జగన్ ప్రశ్నించారు.
వెన్నుపోటుదారులు...
వెన్నుపోటుదారులు కూడా నీతులు మాట్లాడుతుంటే వినలేకపోతున్నామని జగన్ అన్నారు. మ్యానిఫేస్టోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తారన్నారు. దుష్టచతుష్టయంలా ఏర్పడి కలసి కూటమిలా ఏర్పడతారని, ఈ జగన్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట అని అన్నారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యమనిపిస్తుందని జగన్ అన్నారు. సంక్షేమానికి నేరుగా అందచేసిన ప్రభుత్వానికి, పచ్చరంగు పెత్తందారులకు మధ్య నిరంతరం పోరాటం సాగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తనకు ఎవరూ తోడు లేరని, దేవుడి దయతో పాటు ప్రజల తోడు ఉందని జగన్ అన్నారు. తనకు ఏమాత్రం భయంలేదని చెప్పారు. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను నమ్ముకుంటే తాను లక్షలాది కుటుంబాలను నమ్ముకున్నానని అన్నారు. మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని అన్నారు.
నవంబరు నెల నుంచి...
నవంబరు నెల నుంచి గ్రామాల్లోనే రిజిస్ట్రార్ కార్యాలయాలుంటాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ జరిగే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి దశలో 1500 గ్రామాల్లో ప్రవేశపెడతామని, తర్వాత దశలవారీగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తం 17,500 గ్రామాలకు విస్తరిస్తామని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో భూములను సర్వే చేయిస్తున్నామని తెలిపారు. భూముల సర్వేకు 15 వేల మంది సర్వేయర్లను నియమించామని తెలిపారు. భూముల చుక్కల, అనాధీన జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చూపామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,600 ఎకరాల సమస్యకు విముక్తి లభిస్తుందని చెప్పారు.
భూముల యాజమాన్యంపై...
భూముల యాజమాన్యంపై స్పష్టత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. కనీసం తన బిడ్డలకు కూడా బహుమతిగా ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు నుంచి అన్ని భూములకు ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. గ్రామాల్లో రూపు రేఖలను ఈ ప్రభుత్వం మారుస్తుందన్నారు. గ్రామ సచివాలయం నుంచి విలేజ్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీలను కూడా నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. గ్రామాలను దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు. గతానికి, ప్రస్తుతానికి తేడా గమనించాలని కోరుతున్నానని జగన్ అన్నారు.