కన్నడిగులు మరోసారి బీజేపీని తిరస్కరించారు. కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ దే పైచేయి అయింది. బీజేపీ వెనకబడి పోయింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో బీజేపీ పట్టు కో్ల్పోవడం విశేషం. జేడీఎస్ కూడా కొంత మేర సీట్లను గెలుచుకుని తనకూ పట్టుందని నిరూపించుకంుంది. కర్ణాటకలో మొత్తం 102 స్థానిక సంస్థలకు ఎన్నికలు గత నెల 31వ తేదీన ఎన్నికలు జరిగాయి. వీటిలో మొత్తం 2664 స్థానాలున్నాయి. ఇందులో 982 స్థానాల్లో కాంగ్రెస్, 929 స్థానాల్లో బీజేపీ, 307 స్థానాల్లో జనతాదళ్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
పట్టణ ప్రాంతాల్లో......
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఆశించినంత మేర విజయం సాధించలేదు. లోక్ సభ ఎన్నికల దగ్గరపడే సమయంలో నగర ఓటర్లు బీజేపీకి దూరం కావడం ఆందోళన కలిగించే అంశమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు విడివిడిగా పోటీ చేశాయి. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ప్రచారం చేయలేదు. ఎక్కడికక్కడ లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల బాధ్యతను భుజానకెత్తుకున్నారు. కొన్ని నగర పాలకసంస్థల్లో మూడు పార్టీలకూ స్పష్టమైన మెజారిటీ లేదు. అయితే జేడీఎస్, కాంగ్రెస్ లు కలిస్తే పురపాలనను చేపట్టే వీలుంది. కాంగ్రెస్, జేడీఎస్ ల మైత్రిని ప్రజలు ఆశీర్వదించారని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు నిరాశపర్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.