ఇద్దరూ ఈయన జోలికి పోరా?
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నాయి. జేడీఎస్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు;
కర్ణాటకలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. అగ్రనేతలందరూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మోదీ అయితే ఆరు రోజుల నుంచి రోడ్ షోలతోనూ, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సోనియా గాంధీ కూడా ప్రచారానికి వస్తారంటున్నారు. ఇక బీజేపీలో అయితే మోదీ నుంచి కింది స్థాయి నేత వరకూ కర్ణాటకలోనే తిష్ట వేసి ప్రజలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
"నమ్మ కర్ణాటక" పేరుతో...
కాంగ్రెస్ భజరంగదళ్ ను బ్యాన్ చేస్తామని మ్యానిఫేస్టోలో పెట్టడంతో దానిని ప్రధాన అస్త్రంగా మలచుకుంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ నేతలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ప్రధాని మోదీ సయితం సభల్లో జై భజరంగ్ బలి నినాదంతో ఆయన ప్రారంభం... ముగింపు కార్యక్రమంలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించారు. ఈ నెల 6, 7 తేదీల్లో "నమ్మ కర్ణాటక" పేరుతో బొమ్మనహల్లి నుంచి అర్బన్ ప్రాంతాల్లో 17 నియోజకవర్గాలను కవర్ చేసేలా 36.6 కిలోమీటర్లు రోడ్ షో చేయనున్నారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో బీజేపీ ప్రచారం చేస్తుంది.
సూటి విమర్శలు కమలంపైనే...
ఇక కాంగ్రెస్ కూడా సూటిగానే విమర్శలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటక ఇబ్బంది పడుతుందని చెబుతున్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ రోడ్ షోలకు మంచి స్పందన కనిపిస్తుంది. బీజేపీని ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని అగ్రనేతల ప్రచారం సాగుతుంది. ప్రియాంక, రాహుల్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో వారిలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. సర్వేలు కూడా కాంగ్రెస్ గెలుస్తాయని చెబుతుండటంతో నేతలందరూ ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మరింత ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సమాయత్తమవుతున్నారు.
ఊసే లేకుండా...
అయితే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు జనాతాదళ్ ఎస్ పై విమర్శలు చేయడం లేదు. రెండు పార్టీలూ జేడీఎస్ ను పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించడంలేదు. జేడీఎస్‌తో ఎన్నికల అనంతరం పొత్తు ఉండే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు కుమారస్వామి ఊసే ఎత్తడం లేదు. కుమారస్వామి కూడా బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తులతో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందుకే రెండు ప్రధాన పార్టీలూ జేడీఎస్ జోలికి మాత్రం పోవడం లేదు. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్‌కు పట్టుంది. అక్కడ ఆ పార్టీ 30 నుంచి 40 స్థానాలకు పైగానే గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతుండటంతో రెండు ప్రధాన పార్టీల అగ్రనేతలు జేడీఎస్ ఊసే లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తుండటం కర్ణాటక క్యాంపెయిన్‌లో విశేషంగా చెప్పుకోవచ్చు.