మంత్రి వర్గం నుంచి తప్పిస్తారా?

వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించాలన్న ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు

Update: 2022-12-14 04:12 GMT

కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కిందిస్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగిన నేత. కష్టపడి పైకి వచ్చిన లీడర్. కిషన్ రెడ్డి తన అదృష్టాన్ని నమ్ముకున్నారు తప్ప దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నా ఏమాత్రం నిరాశ చెందలేదు. చివరకు లక్ ఆయన ఇంటి తలుపు తట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కిషన్ రెడ్డి తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి ఏకంగా ఎంపీ అయిపోయారు. అంతటితో ఆగకుండా ఆయనకు మోదీ మంత్రివర్గంలో తొలుత సహాయ మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత పూర్తిస్థాయి హోదాలో కేంద్రమంత్రిగా మారిన కిషన్ రెడ్డిని ఇక ఎవరూ ఆపలేకపోయారు.

పార్టీనే నమ్ముకున్న నేత...
తొలి నుంచి భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న నమ్మకమైన నేత కిషన్ రెడ్డి. వెంకయ్యనాయుడి శిష్యుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత పార్టీ అధ్కక్షుడిగా అయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎంపీ, కేంద్రమంత్రి కూడా చిన్న వయసులోనే కాగలిగారు. బీజేపీలో అసాధ్యం కానిది ఏమీ ఉండదన్నది కిషన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది. దక్షిణాదికి తెలంగాణను గేట్ వేగా కూడా పార్టీ అధినాయకత్వం గట్టిగా నమ్ముతుంది. పార్టీ హైకమాండ్ కు నమ్మకమైన నేతలు అవసరం. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలు పార్టీకి మరింత ఉపయోగపడాల్సి ఉంటుంది.

బలమైన సామాజికవర్గాన్ని...
అదే ఇప్పడు కిషన్ రెడ్డికి పదవీ గండాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించాలన్న ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి అవసరమవుతారని భావిస్తున్నారు. పైగా రెడ్డి సామాజికవర్గాన్ని కూడా ఆకట్టుకోవడానికి కిషన్ రెడ్డి ఉపయోగపడతారని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని కమలం వైపునకు తిప్పుకోవాలంటే కిషన్ రెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని పార్టీ అధినాయకత్వం మదిలో ఆలోచన మొదలయినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీలకు మంత్రి పదవి....
అదే జరిగితే కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇవ్వడమే కాకుండా అసెంబ్లీకి పోటీ చేయిస్తారన్న టాక్ కూడా బలంగా వినపడుతుంది. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్‌పేట్ నుంచి పోటీ చేస్తారంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరసగా అంబర్‌పేట్ నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి 2018 లో జరిగిన ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంబర్‌పేట్ లో ప్రతి గల్లీ కిషన్ రెడ్డికి సుపరిచితమే. ఆయన అందరినీ పలుకరించే తత్వం ఉన్న నేత. సమస్యలను సావధానంగా వింటారు. అందుకే కిషన్ రెడ్డిని మరోసారి పోటీ చేయించి ఈ సీటును దక్కించుకోవాలన్న యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలిసింది. అందుకోసమే కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం మాత్రం బలంగా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News