ఏపీలో స్వచ్ఛమైన రాజకీయం కావాలి

ఆంధ్రప్రదేశ్ లో అచ్చమైన, స్వచ్ఛమైన ప్రజారాజకీయం ప్రారంభం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు

Update: 2023-01-02 15:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో అచ్చమైన, స్వచ్ఛమైన ప్రజారాజకీయం ప్రారంభం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఏపీలో మేం కర్తలం, భర్తలం అంటే కుదరదన్నారు. దేశంలో మార్పుకోసం ఏపీ కూడా భాగస్వామి కావాలన్నారు.అంతా మేమే చేయగలం అనే భావన విడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. మంచికోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ సమక్షంలో ఏపీ నేతలు చేరారు. కేసీఆర్ వారికి సాదరంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధి, మాజీ మంత్రి రావెల కిషోర్ , టీజే ప్రకాష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఇప్పుడు వీరిపై ఒక పెద్ద బాధ్యతను పెట్టబోతున్నానని కేసీఆర్ అన్నారు. భారత్ లో 83 కోట్ల భూభాగంలో 41 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యమైనదని అన్నారు. వ్యవసాయం అద్భుతంగా సోలార్ విద్యుత్తు ద్వారా జరుపుకోవచ్చన్నారు. వాతావరణం కూడా ఇక్కడ వ్యవసాయానికి అనుకూలిస్తుందని కేసీఆర్ అన్నారు. యాపిల్ పండుతాయి. మామిడి పండ్లు మన దేశంలో వస్తాయన్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు.

వేల టీఎంసీల వృధా...
1,40,000 టీఎంసీల వర్షం భారత్ లో కురుస్తుందని కేసీఆర్ అన్నారు. 70 వేల టీఎంసీల నీరు ఆవిరవుతుందన్నారు. 40 వేల టీఎంసీలతో ఇండియాలో ఉన్న వ్యవసాయ భూములన్నింటికీ సాగునీరు అందించవచ్చన్నారు. భూమి, నీరు, అనుకూలమైన వాతావరణంతో పాటు మానవ సంపద కూడా భారత్ కు ఉందన్నారు. లక్ష కోట్ల విలువైన పామాయిల్ ను, కందిపప్పును దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దేశంలో నెలకొని ఉందన్నారు. దీని నుంచి బయటపడటానికి యువత ఆలోచించాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ అంటే ఇండియా అని చెప్పారు. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుతామని ఆయన అన్నారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని కేసీఆర్ అన్నారు. జ్ఞానాన్ని కొందరి నుంచి నేర్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే కాగానే ఇప్పుడు కొందరికి కొమ్ములొస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఇప్పటికీ విద్యుత్తు కోతలు ఎందుకు ఉన్నాయో ఆలోచించుకోవాలన్నారు.
ఆలోచనాపరులందరినీ ఏకం చేస్తాం...
స్థాపిత విద్యుత్ నాలుగు లక్షల మెగావాట్లు అని, కానీ ఏనాడు 2.10 లక్షల మెగావాట్లకు మించి దేశంలో వినియోగించలేదన్నారు. కరెంటు ఉన్నా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ప్రజలు దేశంలో వంచించబడుతున్నారన్నారు. మార్పు రావాలనే బీఆర్ఎస్ పార్టీని స్థాపించామని తెలిపారు. దేశంలోని ఆలోచనాపరుల్ని ఏకం చేసి అభివృద్ధి వైపు తీసుకెళతామన్నారు. ఈ యజ్ఞంలో కొన్ని నష్టాలు జరగవచ్చని, అయినా వెరవకుండా ముందుకు వెళతామని కేసీఆర్ తెలిపారు. దేశమంతటా చైనా బజార్ లున్నాయని, భారత్ బజార్ లు ఎక్కడున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. నెపాలు చెప్పేవాళ్లు నాయకులు కాదని కేసీఆర్ అన్నారు. అనేక సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ అని అన్నారు.
విశాఖ ఉక్కును అమ్మితే...?
ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే ఇండియా రియాక్ట్ అవుతుందన్నారు. భారత్ లో 6,64 లక్షల గ్రామాల్లో బీఆర్ఎస్ ఏర్పడాలన్నారు. బీఆర్ఎస్ కు అధికారమిస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్తు, దళితులకు దళిత బంధు ఇస్తామన్నారు. విశాఖ ఉక్కును తాము విక్రయించబోమని తెలిపారు. మోదీ ప్రభుత్వం అమ్మినా తిరిగి బీఆర్ఎస్ పబ్లిక్ సెక్టార్ లోకి తీసుకువస్తుందన్నారు.లక్షల కోట్ల ప్రజల ఆస్తులు అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నా మేధావులు గొంతు విప్పడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి పార్టీని వేగంగా పరుగులు తీయిస్తామన్నారు.


Tags:    

Similar News