కేసీఆర్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు వారేనా?
సిట్టింగ్ లు తమతో టచ్ లో ఉన్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి;
"సిట్టింగ్ లు కూడా బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. నాతో టచ్ లో ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం రష్ పెరిగిపోతుంది. అనేక మంది నేతలు పార్టీలో చేరతారు" రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా అధికార వైసీపీలోనే కేసీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సిట్టింగ్ లు అంటే ఎవరు? ఏపీలో టీడీపీ, వైసీపీలకు చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జనసేనకు అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన వైసీపీ మద్దతు దారుగా నిలిచారు.
టీడీపీకి ఎమ్మెల్యేలున్నా...
ఇక బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌లకు మాత్రం ఎమ్మెల్యేలే లేరు. సో.. బీఆర్ఎస్ లోకి వస్తే వైసీపీ, టీడీపీల నుంచే రావాల్సి ఉంటుంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు, అనధికారికంగా 18 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తుందని ఆశిస్తారు. భావిస్తారు. ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ టీడీపీని వీడలేదంటే వారు పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్నారనే అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నుంచి ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ కు వెళ్లే ఆలోచన చేయకపోవచ్చు. పైగా సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు గ్యారంటీ అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో వారు పార్టీని వీడే ఛాన్స్ లేదు.
టచ్ లో ఉంటే...
ఇక కేసీఆర్ తో నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటే.. అది వైసీపీ నుంచే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ను మినహాయిస్తే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలున్నారు. వారిలో అసంతృప్త నేతలుండవచ్చు. పైగా జగన్ పనితీరు బాగా లేని కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 మంది వరకూ ఈసారి సిట్టింగ్ లకు టిక్కెట్లు దక్కే అవకాశం లేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పైగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో అనేక మందికి హైదరాబాద్ లో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే కేసీఆర్ తో టచ్ లో ఉంది వైసీపీ ఎమ్మెల్యేలనే అనుకోవాల్సి ఉంటుంది.
ఊరికే అన్నారా?
అయితే ఇక్కడ మరో అనుమానం కూడా లేకపోలేదు. కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ నేతల్లో జోష్ నింపడానికే అలా అని ఉంటారన్న వాదన కూడా లేకపోలేదు. ఏదో అన్యాపదేశంగా, ప్రాస కోసం అలా కేసీఆర్ అని ఉంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే తప్ప ఏపీలో ఏమీ లేని బీఆర్ఎస్ లోకి వెళ్లి ఏం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయమని ఎవరూ వెళ్లరన్న ధీమాను వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ చేసిన సిట్టింగ్ ల వ్యాఖ్యలు మాత్రం అధికార పార్టీలో కాక రేపుతున్నాయనే చెప్పాలి.