చంద్రబాబు అంత వీక్ అయ్యారా?
చంద్రబాబు తన ప్రచారంలో కోణాన్ని మార్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడం వెనక ప్రజల నుంచి సానుభూతి పొందడానికే.
అనుకున్నట్లే జరుగుతుంది. చంద్రబాబు తన ప్రచారంలో కోణాన్ని మార్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడం వెనక ప్రజల నుంచి సానుభూతి పొందడానికే. చంద్రబాబుకే కాదు కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరికైనా ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గెలుపు దక్కకపోతే ఆ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా మారుతుంది. చంద్రబాబు నాయకత్వాన్ని చూసి ఇప్పటికీ పార్టీలో నేతలు కాని, కార్యకర్తలు కాని ధైర్యంతో ఉన్నారు. ఆయన రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సైకిల్ పార్టీకి చెందిన ఏ తమ్ముడికీ సమాధానం దొరకదు.
నేతల్లో నమ్మకం...
చంద్రబాబుకు ఇప్పటికే ఏడు పదుల వయసు దాటింది. అయినా ఆయన ఆరోగ్యవంతంగానే ఉన్నారు. పార్టీని మరికొంత కాలం నడుపుతారన్న నమ్మకం నేతల్లో ఉంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఆయన మారగలరు. తన వ్యూహాలను కూడా మార్చుకోగలరు. చంద్రబాబు ఎలాగైనా ఈసారి పార్టీని అధికారంలోకి తెస్తారన్న నమ్మకం టీడీపీలోని ప్రతి ఒక్క కార్యకర్తకూ ఉంది. అది చంద్రబాబు సామర్థ్యం పై ఉన్న విశ్వాసం. ఆయన ఎత్తుగడల పట్ల ఉన్న అపారమైన నమ్మకం. అందుకే ఇప్పటికీ రాష్ట్రమంతటా టీడీపీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
పార్టీలో కలకలం...
అలాంటి చంద్రబాబు కర్నూలు సభలో చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ కలకలం రేపాయని చెప్పవచ్చు. ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అని అనవచ్చు. కానీ తనను ఈసారి అసెంబ్లీకి పంపకుంటే (టీడీపీ అధికారంలోకి వచ్చి సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతారని శపథం చేశారు) తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించడం మాత్రం క్యాడర్ లో అలజడి రేగింది. తన భార్యను తిట్టారంటూ సానుభూతి కోసం మరోసారి ప్రయత్నించారు. చంద్రబాబు ఎప్పుడూ రాజకీయాల్లో భయపడరు. అలాగని ఆయన సాహసోపేత నిర్ణయాలనూ తీసుకోలేరు. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఇలా అధైర్యపడలేదు. ఆయన నోటి నుంచి తనకు ఇవే చివరి ఎన్నికలు అని రావడంపై పార్టీలోనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు తన బలహీనతను బయటపెట్టుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
అంత ఎమోషనల్ గా....
రాజకీయాలకు వయసు అడ్డు కాదు. నవీన్ పట్నాయక్ వంటి వారు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఎ యడ్యూరప్ప కూడా ఏడు పదుల వయసులో హుషారుగానే ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ సమయంలో అలా కామెంట్ చేసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక్క ఎన్నికలో ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం ఎందుకు? ప్రజల నుంచి సానుభూతి ఆశిస్తే అది ఎంత వరకూ పనిచేస్తుంది? చంద్రబాబు అంత ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడారు?తనను గెలిపించకపోతే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడం బ్లాక్ మెయిలింగ్ అని కూడా ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎలాంటి చంద్రబాబు ఎలా అయిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.