మంత్రి మేకపాటి పార్థివదేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, మంత్రి కేటీఆర్

మేకపాటి పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ మంత్రి

Update: 2022-02-21 08:26 GMT

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో వైసీపీ నేతలతో పాటు.. స్వస్థలమైన నెల్లూరు జిల్లా వాసులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో నెల్లూరులోని నివాసానికి తరలి వెళ్తున్నారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే మేకపాటి భౌతిక కాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి హైదరాబాద్ లోని నివాసానికి తరలించారు.

మేకపాటి పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్ భౌతిక కాయాన్ని చూసిన చంద్రబాబు.. భావోద్వేగానికి గురయ్యారు. మేకపాటి ఆకస్మిక మరణం తనను చాలా బాధించిందన్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండే మనిషి ఇలా గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందడం నమ్మశక్యంగా లేదన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి నివాసం వద్ద ఉంచిన భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అంతకుముందు ట్విట్టర్లో సంతాపం ప్రకటించారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News