సీనియర్లే బెస్ట్ అట... వారి ఎంపిక పూర్తయిందట
చంద్రబాబుకు ఎంపీ ఎక్కువ సంఖ్యలో వచ్చే ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే జాతీయ స్థాయిలో మరోసారి కీ రోల్ పోషించగలరు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక సమస్య ప్రధానంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో వెళ్లడం ఖాయం. జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీని కూడా కలుపుకుని వెళ్లేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబుకు పార్లమెంటు సభ్యులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే జాతీయ స్థాయిలో తాను మరోసారి కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
లోక్ సభ స్థానాలు....
ఇక పొత్తులు ఉన్నా మిత్రపక్షాలు పెద్దగా లోక్ సభ సీట్లు కోరుకోవు. జనసేన, బీజేపీ కలసి వచ్చినా రెండు పార్టీలకు కలిపి నాలుగైదు స్థానాలను మాత్రమే కేటాయిస్తారంటున్నారు. జనసేన కూడా ఎంపీ స్థానాలకంటే ఎమ్మెల్యే స్థానాలనే ఎక్కువగా కోరుకుంటుంది. అందుకే చంద్రబాబు ఎంపీ అభ్యర్థులపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న సీనియర్ నేతలను తీసుకునేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని పేర్లను....
గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం మూడు ఎంపీ స్థానాలే దక్కాయి. అదీ శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు మాత్రమే. అందుకే ఈసారి సీనియర్ నేతలను రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్న పేరున్న నేతల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాకినాడకు మాజీ కేంద్రమంత్రి పేరు, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు వంటి నియోజకవర్గాలకు సీనియర్ల పేర్లను ఇప్పటికే ఖారారు చేశారంటున్నారు.
పార్టీలో సీనియర్లను....
పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు వెళ్లవనుకున్న స్థానాల్లో మాత్రమే చంద్రబాబు కొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. టీడీపీలో ఉన్న సీనియర్ నేతలను కూడా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఉదాహరణకు రాజమండ్రి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోటీ చేయిస్తే, కాకినాడ నుంచి మాజీ మంత్రి పల్లంరాజు ను పోటీ చేయించాలని భావిస్తున్నారు. అలాగే మరికొందరిని పార్టీలోకి చేర్చుకునేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీలో పట్టు దొరకాలంటే ఎంపీ అభ్యర్థులను అత్యధిక స్థానాలను ఈసారి గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు.