కేసీఆర్ డ్రాప్ అయ్యారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీపై వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. బీఆర్ఎస్ ఆలోచనను పక్కన పెట్టినట్లే అనిపిస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీపై వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. భారత రాష్ట్ర సమితి ఆలోచనను పక్కన పెట్టే కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి దేశంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. కొత్త పార్టీతో మోదీని ఎదుర్కొనలేమని ఆయన భావిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇందుకు సమయం కూడా చాలకపోవచ్చు. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా కొత్త పార్టీని, దాని ఉద్దేశ్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా కష్టమనే ఆయన భావించడం వల్లనే కొత్త ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనపడుతుంది.
బీఆర్ఎస్ ను...
నిన్న మొన్నటి వరకూ భారత రాష్ట్ర సమితిని స్థాపించాలని కేసీఆర్ భావించారు. కానీ దేశ వ్యాప్తంగా పార్టీని పరిచయం చేయడానికి వచ్చే ఎన్నికల్లోపు కుదరదు. అందుకు తగిన సమయమూ లేదు. కొత్త పార్టీని స్వల్ప కాలంలో ప్రజలు ఆదరించకపోవచ్చు. నమ్మకపోవచ్చు. అందుకే కొత్త ఫ్రంట్ వైపు కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఆయన మాటలను బట్టి కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లే కనపడుతుంది.
సరైన నాయకత్వం లేక...
కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ మోదీని సమర్థంగా ఎదుర్కొనలేకపోతుంది. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలే దానిని నమ్మడం లేదు. కాంగ్రెస్ ను కూడా ప్రజలు విశ్వసించడం లేదు. జాతీయ రాజకీయాల్లో మోదీని దెబ్బతీయాలంటే ప్రస్తుతమున్న కాంగ్రెస్ నాయకత్వం సరిపోదు. దానికి సమర్థత లేదన్నది ఆ గూటిలో ఉన్న పార్టీలు అంగీకరిస్తున్నాయి. అందుకే కొత్త ఫ్రంట్ కు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ ఫ్రంట్ లో ఉండేది కాంగ్రెస్ వెంట ఉన్న పార్టీలే అయినా కొత్త రంగు, హంగు అద్దాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా కన్పిస్తుంది.
ప్రజల నమ్మకంపైనే...
నాయకత్వం మారితేనే ప్రజలు విశ్వసిస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. దేశానికి సరైన దిశ చూపగలే నాయకుడినే ప్రజలు నమ్ముతారన్నది ఆయన ఆలోచన. అందుకే భారత రాష్ట్ర సమితిని తాత్కాలికంగా పక్కన పెట్టి కొత్త ఆలోచనను కేసీఆర్ దిగినట్లు కనపడుతుంది. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ఆయన కొత్తగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ కొత్త ఫ్రంట్ కు ఏ పార్టీలు మద్దతు పలుకుతాయన్నది రానున్న కాలంలో వేచి చూడాల్సిందే.