అట్లుంటది పెద్దాయనతో
దేవెగౌడ సూచనలతోనే కర్ణాటకలో బీఆర్ఎస్ సభలు పెట్టడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.;
దేవెగౌడ.. అసాధ్యమయిన ప్రధాని పదవిని తనకు దక్కేలా చేసుకోగలిగారు. అలాగే అనేక సార్లు పుత్రుడు కుమారస్వామిని తన రాజకీయ వ్యూహాలతో ముఖ్యమంత్రిని చేయగలిగాడు. కర్ణాటకలో ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నా కన్నడ రాజకీయాలను శాసిస్తున్నారంటే అది పెద్దాయన స్ట్రాటజీ ఫలితమే. అందుకే కుటుంబ పార్టీ అయిన జనతాదళ్ ఎస్.. కొన్ని ప్రాంతాలకే పరిమితమయిన జేడీఎస్.. విజయాల వెనక మాజీ ప్రధాని దేవెగౌడ వ్యూహాలుంటాయి. అట్లంటుంది ఆయనతో మరి అని అనుకునేలా ఆయన ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తారు.
ఉప ప్రాంతీయ పార్టీగా....
దేవెగౌడ కుటుంబం ఒక్కలిగ సామాజికవర్గం అండతో అందలం ఎక్కుతూ వస్తుంది. పార్టీలతో పని లేదు. సిద్ధాంతాల అవసరం లేదు. ఆ పార్టీ జెండా.. అజెండాలను పట్టించుకోదు. తమతో అవసరం ఉన్న ఏ పార్టీతోనైనా కౌగిలించుకోగలదని జేడీఎస్ అనేక సార్లు చాట చెప్పింది. ఒకసారి బీజేపీతో, మరికొన్ని సార్లు కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. పూర్తి కాలం అధికారంలో లేకపోయినా సరే తమ ప్రయత్నాలను మాత్రం విరమించుకోదు. 220 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. అందులో జేడీఎస్ ఎప్పుడూ పూర్తి మెజారిటీ రాలేదు. ఎందుకంటే ఆ పార్టీకి కర్ణాటక అంతటా బలం లేదు. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఖచ్చితంగా సొంతం చేసుకుంటుంది.
బహిరంగంగానే...
నిజానికి మొన్నటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు కుమారస్వామి మద్దతు బహిరంగంగానే పలికారు. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని అనుకున్నారు. కర్ణాటక మహారాష్ట్రలో జేడీఎస్‌తో కలసి బీఆర్ఎస్ పోటీ చేయాలని భావించింది. కొంత నిధులను కూడా సమకూర్చాలని బీఆర్ఎస్ కూడా భావించింది. కానీ ఉన్నట్లుండి జేడీఎస్ సైలెంట్ అయింది. కుమారస్వామి కూడా బీఆర్ఎస్ సభలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకను వదిలి మహారాష్ట్రపైనే ఫోకస్ పెట్టారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? అక్కడ సభలు ఎందుకు పెట్టడం లేదు? పోనీ బహిరంగంగా ఎందుకు మద్దతు ప్రకటించడం లేదు? అన్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానం బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారే కానీ అసలు కారణం మాత్రం బయటకు చెప్పడం లేదు.
బీజేపీతో కలవాల్సి వస్తే....
బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ. మోదీని కేసీఆర్ ఒంటికాలు మీద లేచి విమర్శిస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో తిరిగి హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదంటూ కొన్ని సంస్థలు సర్వేల ద్వారా తేల్చాయి. దీంతో జేడీఎస్ బీజేపీతోనయినా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ నేతలు అంగీకరిస్తే అందుకు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. పాత మైసూరు ప్రాంతంలోని 89 స్థానాల్లో 39 స్థానాలయినా గెలుస్తామని నమ్మకంతో ఉంది. అందుకే పెద్దాయన స్కెచ్ మేరకు కుమారస్వామి బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారంటున్నారు. రానున్న ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో తెలియక ముందు మోదీని వ్యతిరేకిస్తున్న వారితో పొత్తు వద్దని కుమారుడికి చెప్పడంతోనే ఆయన దూరమయ్యారన్నది వాస్తవమట. అందుకే పెద్దాయన పై పంచె విదిలిస్తే అట్లుంటది మరి అంటున్నారు జేడీఎస్ నేతలు. అయితే కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తే ఇక చేయగలిగిందేమీ లేదు. అయినా ముందు చూపుతోనే బీఆర్ఎస్‌కు జేడీఎస్‌ను పెద్దాయన తాత్కాలికంగా దూరం చేశారంటున్నారు.