కర్ణాటకలో రాహుల్ మానియా ఉందా?

కర్ణాటక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ రోజురోజుకూ బలపడుతుంది.

Update: 2023-03-27 04:13 GMT

కర్ణాటక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ రోజురోజుకూ బలపడుతుంది. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం తీర్పు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని కర్ణాటక కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ నెలకొని ఉందన్న విశ్లేషణలు వినపడుతున్న నేపథ్యంలో రాహుల్ పై వేటు పార్టికి మరింత ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

నోటిఫికేషన్ రాకముందే...
కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా అధినాయకత్వం ముందుగానే ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడక ముందే 124 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించడం మరింత ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రకటించారు. ఎన్నికలకు ఆరు నెలలు ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామన్న ఆయన ప్రకటన కార్యరూపం దాల్చింది. ఇక్కడ బలమైన నేతలు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యలు వరస పర్యటనలు చేస్తూ జనంలోకి వెళుతున్నారు. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ఎప్పటి నుంచో ప్రారంభించారు.
గత ఎన్నికల్లో...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సక్సెస్ అయింది. రాహుల్ యాత్ర పూర్తయిన వెంటనే కాంగ్రెస్ నేతలు దానికి అనుబంధంగా యాత్రలను చేపట్టడం కూడా కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా 124 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మరో వంద మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అదీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో సరైన అభ్యర్థులను, నమ్మకమైన నేతలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అధికారాన్ని మధ్యలోనే తీసుకెళ్లిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 74 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది.
సర్వేల ద్వారా....
ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంది. సర్వేల ద్వారా సమాచారాన్ని సేకరించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈసారి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్‌కు సానుభూతి కలసి వస్తుందని, యడ్యూరప్పను కూడా సీఎం పదవి నుంచి తొలగించడంతో లింగాయత్ ల వర్గంలో కూడా అసంతృప్తి కనపడుతుందంటున్నారు. ఇక డికే శివకుమార్ ఒక్కలిగ వర్గానికి చెందిన వారు కావడం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కారణంగా దళిత ఓటు బ్యాంకు తమ పరం అవుతుందని కాంగ్రెస్ విశ్వసిస్తుంది. మరి చూడాలి. ప్రధాని నుంచి కేంద్ర మంత్రులు వరస పర్యటనలు చేస్తుండటంతో చివరకు గెలుపు ఎవరివైపు ఉంటుందన్నది చూడాల్సి ఉంది. రాహుల్ గాంధీ వేటు అంశంతో కర్ణాటకలో కాంగ్రెస్‌కు కొంత ఊపు వచ్చినట్లేనని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News