తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినా, హంగ్ ఏర్పడినా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన గులాం నబీ ఆజాద్ తో పాటు ఇతర ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, డీకే శివకుమార్, జైరాం రమేశ్ ఇవాళ హైదరాబాద్ కి వస్తున్నారు. ఫలితాలు, తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలను వారు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు చేజారకుండా అవసరమైతే పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంపు కూడా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థులతో క్యాంపు..?
ఇందుకోసం పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఇవాళ సాయంత్రానికి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ కు రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇలాగే కౌంటింగ్ కు ముందే రంగంలోకి దిగి అతిపెద్ద పార్టీగా ఏర్పడిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునే జేడీఎస్ కి మద్దతు ఇచ్చి అధికారంలో కాంగ్రెస్ ను భాగం చేశారు. కర్ణాటక మాదిరిగానే ఫలితాలు వస్తాయనే అంచనాలతో వారంతా హైదరాబాద్ కి వస్తున్నారు. అవసరమైతే మజ్లీస్ పార్టీతోనూ వీరు చర్చించే అవకాశం ఉంది.