తెలంగాణ కాంగ్రెస్ కు రాహుల్ కితాబు

తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు

Update: 2022-11-07 13:10 GMT

తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. తాను కార్యకర్తల పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నానని తెలిపారు. తెలంగాణను వదిలి మహారాష్ట్రలోకి వెళుతున్నానని చెప్పారు. తెలంగాణను వీడటం కొంత బాధగానే ఉన్నప్పటికీ జోడో యాత్రలో భాగంగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యాత్రలో తాను అన్ని వర్గాల వారినీ కలుసుకున్నానని తెలిపారు. వారి ఆందోళనను దగ్గరుండి చూశానని, సమస్యలను విన్నానని తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు.

పార్టీని మరింత బలోపేతం...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను నమ్ముతున్నానని తెలిపారు. తెలంగాణ వాసుల మనోధైర్యం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో ఉపాధి, విద్య అవకాశాలు తగ్గాయన్నారు. దళితుల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ తీసుకొచ్చిన పథకాలను కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో అణిచివేత కుదరదని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులు సంతోషకరంగా లేరన్నారు. ఏ రైతు కూడా తాను చేస్తున్న వ్యవసాయం లాభదాయకంగా లేరన్న అభిప్రాయంతోనే ఉన్నారన్నారు. దెబ్బతిన్నా ఎదురొడ్డి పోరాటం చేయడం తెలంగాణ నైజమని ఆయన అన్నారు.
రైతు రుణ మాఫీ..
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు 72 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధరను ఇస్తామని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి పొద్దున ఇరిగేషన్ ప్రాజెక్టులపై వచ్చే కమిషన్ గురించి ఆలోచిస్తుంటాడని, రాత్రి ధరణి పోర్టల్ తెరచి ఎవరి భూములు లాక్కోవాలో చూస్తారన్నారు. ఈ సీఎం వల్ల తెలంగాణ రైతులకు, యువతకు, పేదలకు ఉపయోగం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. నరేంద్రమోదీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారన్నారు.


Tags:    

Similar News