Rahul Gandhi : ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం.. తొలి మంత్రివర్గ సమావేశంలోనే

తాము అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం దిగమింగిన సొమ్మును కక్కిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు

Update: 2023-11-01 13:57 GMT

తాము అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం దిగమింగిన సొమ్మును కక్కిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. షాద్ నగర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఒకే కుటుంబం తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను దోచుకుంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందన్నారు. ప్రాజెక్టు కుంగిపోయినా బీజేపీ పట్టించుకోవడం లేదని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయనడానికి ఇది నిదర్శనమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ నాపిరకంగా నిర్మించి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారంటూ ఆయన ఫైర్ అయ్యారు.

ధరణి పేరుతో...
కంప్యూటరైజన్ పేరుతో ధరణి పేరుతో ప్రజల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 2014లో అధికారంలోకి రాగానే దేశమంతటా ఓసీ జనగణన చేపడతామని ఆయన అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఆరు గ్యారంటీలను తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఆమోదం పొందేలా చేసి వాటిని అమలు పర్చే బాధ్యతను తాను తీసుకుంటానని రాహుల్ గాంధీ తెలిపారు.
ఉద్యోగాలను అన్నింటినీ...
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నంటినీ భర్తీ చేస్తామని చెప్పారు. మహిళల అకౌంట్లలోకి 2,500 రూపాయలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒక్కటేనని తెలిపారు. బీజేపీ దేశాన్ని విడగొట్టాని చూస్తుంటే.. కాంగ్రెస్ అందరినీ కలపాలని చూస్తుందన్నారు. బీజేపీకి అన్ని చోట్ల పరోక్షంగా ఎంఐఎం సాయం చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడానికి డబ్బులు బీజేపీయే ఇస్తుందని ఆయన ఆరోపించారు
ఆ మూడు పార్టీలూ ఒక్కటే...
రైతు చట్టాలు, జీఎస్టీకి కూడా బీఆర్ఎస్ మద్దతిచ్చిందని రాహుల్ తెలిపారు. సీఎం కుటుంబ సభ్యులందరూ మంత్రులుగా ఉన్నారన్నారు. అన్ని శాఖలు వారి చేతుల్లోనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ధరణితో 25 లక్షల కుటుంబాలకు చెందిన భూమిని కబ్జా చేసిందన్నారు. కూలిపోతున్న బ్యారేజీలను కేసీఆర్ పరిశీలించాలని రాహుల్ కోరారు. బీజేపీ వాళ్లు తన మీద కేసులు పెట్టి చివరకు తన ఇంటిని కూడా లాక్కున్నారని రాహుల్ అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని అన్నారు. అధికారంలోకి తాము రాగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రాహుల్ చెప్పారు.


Tags:    

Similar News