హైదరాబాద్ లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ లో 2007లో జరిగిన జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి(ఏ1), అనీఖ్ షఫీఖ్ సయ్యద్(ఏ2)ను దోషులుగా కోర్టు ఖరారు చేసింది. సరైన ఆధారాలు లేవంటూ మిగతావారిని నిర్దోషులుగా న్యాయస్థానం తేల్చింది. దోషులకు వచ్చే సోమవారం చర్లపల్లి జైలులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇక ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న అమీర్ రాజా ఖాన్, రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ పరారీలో ఉన్నారు. వీరంతా ఇండియన్ ముజాహిద్దిన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు. 2007 ఆగస్టు 25న నిమిషాల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 44 మంది మరణించగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిల్ షుఖ్ నగర్ ఫూట్ ఓవర్ బ్రిడ్జి వద్ద మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.