అందరికీ ధైర్యం చెప్పి.. తానే బలవన్మరణం పొంది?
వ్యక్తిత్వ వికాసనిపుణుడిగా ఎంతో మంచిపేరున్న జైపాల్ రెడ్డి మరణం కలచి వేస్తుంది.
అందరికీ ధైర్యం చెప్పే ఆ యువకుడు తానే మనోధైర్యాన్ని కోల్పోయాడు. వ్యక్తిత్వ వికాసనిపుణుడిగా ఎంతో మంచిపేరున్న జైపాల్ రెడ్డి మరణం కలచి వేస్తుంది. ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయనను తెలిసిన వారెవరూ నమ్మలేకపోతున్నారు. జైపాల్ రెడ్డి కామారెడ్డి జిల్లాలోని పిల్లం మండలం అల్లాపూర్ లో జన్మించారు. ఉన్నత చదువులు చదివిన జైపాల్ రెడ్డి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఎనిమిదివేలకు.....
ఎందరో ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం చెప్పి వారి జీవితాలను నిలబెట్టారు. జైపాల్ రెడ్డి వయసు 34 సంవత్సరాలు. రాష్ట్ర వ్యాప్తంగా జైపాల్ రెడ్డి పర్యటించి వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. దాదాపు ఎనిమిది వేల వరకూ ఆయన ప్రసంగాలు చేశారు. జైపాల్ రెడ్డి ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే అనారోగ్యం కారణంగానే జైపాల్ రెడ్డి మృతి చెందారని, ఆ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారని పోలీసులు చెబుతున్నారు.
అనారోగ్యం కారణమేనా?
ఈ నెల 22వ తేదీన ఆయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వ్యక్తిత్వ వికాస క్లాసులను నిర్వహించే జైపాల్ రెడ్డి కరోనా కారణంగా కొంతకాలంగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన కొంత నెమ్మదించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ ను కూడా స్థాపించారు. దాని వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని జైపాల్ రెడ్డి చెప్పేవారు. జైపాల్ రెడ్డి మరణం ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యమే ఆయన బలవన్మరణానికి కారణమని అంటున్నారు.