రోజులు మారాయి రెడ్డి గారూ

డీఎల్ రవీంద్రారెడ్డి అవుట్ డేటెడ్ లీడర్. ఆయన చేసే విమర్శలకు విలువ ఉండదు. ప్రజల్లో పలుకుబడి కూడా పూర్తిగా పలుచనయిపోయింది;

Update: 2022-12-28 05:01 GMT

అవుడేటెడ్ లీడర్స్ కు ఇక రాజకీయాల్లో కాలం చెల్లింది. ఇటు పార్టీలు వారికి అవకాశాలు ఇవ్వవు. అటు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఏదో ఊరిలో ఒక ఇంటికి వచ్చి కూర్చుని వెళ్లి ఓట్లు అడిగే రోజులు కావివి. వాటికి ఎప్పుడో ఫులస్టాప్ పడ్డాయి. ఇప్పుడంతా ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుంటేనే ఓటరు దేవుడు కరుణిస్తాడు. అంతే తప్ప పెత్తనం చెలాయించే వారికే పట్టం కట్టే రోజులు పోయాయి. అందరితో ఒద్దికగా ఉండి అందుబాటులో ఉండే వారికి మాత్రమే ప్రజలు జై కొడుతున్నారు. జనరేషన్ మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పరిస్థిితి ఏంటన్నది ఆయనకు తెలియంది కాదు.


అవుట్ డేటెడ్ లీడర్....

డీఎల్ రవీంద్రారెడ్డి అవుట్ డేటెడ్ లీడర్ అనే చెప్పాలి. ఆయన చేసే విమర్శలకు విలువ ఉండదు. ప్రజల్లో పలుకుబడి కూడా పూర్తిగా పలుచనయిపోయింది. దాదాపు దశాబ్దకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మైదుకూరులో డీఎల్ రవీంద్రారెడ్డి పట్టున్న నేత. అయితే అది ఇప్పుడు కాదు. దశాబ్దకాలం క్రితం వరకు మాత్రమే. ఇప్పుడు రోజులు మారాయి. పాత తరహా రాజకీయం ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి ఆరు సార్లు విజయం సాధించవచ్చు. కానీ 2009లో ఆయనది చివరి గెలుపుగా చెప్పుకోవాలి. ఆయన కంటూ ఇప్పుడు వర్గమూ లేదు. ఓటు బ్యాంకు లేదు.
పుట్టాను కాదని...
మైదుకూరులో ఉన్నది పార్టీ పరంగానే. వ్యక్తిగత ఓటు బ్యాంకు ఇప్పుడు ఎవరికీ లేదన్నది వాస్తవం. డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నారో? లేదో? తెలియదు. కానీ అదే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తప్పించి ఈ రాష్ట్రాన్ని రక్షించే వారు లేరన్నది ఆయన అభిప్రాయాన్ని ఇటీవల కుండబద్దలు కొట్టేశారు. ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఆయనకు దక్కే అవకాశమే లేదు. అక్కడ బలమైన పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. పుట్టాను కాదని డీఎల్ ను పిలిచి టిక్కెట్ ఇచ్చేంత పెద్ద మనసు చంద్రబాబుకు ఉండదు. ఉండే అవసరం కూడా లేదు. కావాలంటే పార్టీ కండువా కప్పి పక్కన కూర్చోబెడతారు తప్పించి పిలిచి టిక్కెట్ ఇచ్చేంత సీన్ లేదు.

విశ్రాంతి తీసుకుంటేనే...
ఇక డీఎల్ రవీంద్రారెడ్డికి ఒకే ఒక్క అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీలో చేరితే.. ముందుగా హామీని తీసుకోగలిగితే ఎమ్మెల్సీ పదవి మాత్రం దక్కే అవకాశాలున్నాయి. అంతే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఏ పార్టీ డీఎల్ కు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే డీఎల్ పెద్ద తలనొప్పి నేత. తన మాట నెగ్గాలనుకునే వ్యక్తి. అలాంటి నేతను పిలిచి మరీ నెత్తిన ఎవరు పెట్టుకుంటారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే డీఎల్ ను ప్రస్తుత రాజకీయాల్లో సీరియస్ గా తీసుకునే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. అందుకే డీఎల్ ను దగ్గరకు తీసుకోవడమూ.. దూరం చేసుకోవడమూ పెద్ద విషయమేమీ కాదన్నది రాజకీయ నేతల అభిప్రాయం. ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటేనే మంచిదన్న సూచనలు సోషల్ మీడియా వేదికపై వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News