అక్కడ సిట్టింగ్ లకు టిక్కెట్ దక్కే ఛాన్సే లేదట

తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకమనే చెప్పాలి. రాజస్థాన్ లో ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించనున్నారు.;

Update: 2023-01-21 07:38 GMT

రానున్న తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు విపక్ష కాంగ్రెస్ కు కీలకమనే చెప్పాలి. సెంటిమెంట్ ప్రకారం ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండోసారి రాజస్థాన్ లో రాదు. గత కొన్ని దఫాలుగా అదే జరుగుతుంది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరు అధికారంలో ఉంటే వారికి ఎన్నికల సందర్భంగా కష్టాలు తప్పవు. రాజస్థాన్ ప్రజలు మార్పును కోరుకుంటారని దీన్ని బట్టి భావించవచ్చు. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. 101 సీట్లు మ్యాజిక్ ఫిగర్, వంద సీట్లు దాటితే వారిదే అధికారం. 2012 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే 2017లో కాంగ్రెస్ గెలిచింది. ఈసారి అధికారం ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.


పార్టీని నమ్ముకునే...

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని మధ్యలో కోల్పోయినా రాజస్థాన్ లో మాత్రం స్థిరంగా ప్రభుత్వం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ లో గ్రూపులున్నప్పటికీ బీజేపీ వైపు వెళ్లేందుకు నేతలు వెళ్లకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు మనుగడ కొనసాగింది. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను మెచ్చుకోకుండా ఉండలేం. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కావాల్సి ఉంది. తన పార్టీ ఎమ్మెల్యేలను జారీ పోకుండా చూసుకోవడమే కాకుండా బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలను తమలో కలుపుకున్న నేతలున్న రాష్ట్రమది.
కాంగ్రెస్ కాదు.. గెహ్లాత్ వర్గంగా...
అయితే కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలకు కొదవలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ లు మధ్య విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ మాట వినని ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారన్నది ఢిల్లీ పెద్దలకు కూడా తెలిసి పోయింది. అశోక్ గెహ్లాత్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేయాలనుకున్న హైకమాండ్ సీఎం పదవిని వదిలిపెట్టాలని సూచించింది. ఒకే వ్యక్తికి ఒకే పదవి విధానంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుందని అశోక్ గెహ్లాత్ సయితం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు నిరాకరించారు. ఆయన వర్గం వంద మంది ఎమ్మెల్యేలు ఆయన వెంటే నిలిచారు. సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిని చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

టిక్కెట్ల ఎంపికలో...
ఢిల్లీకి ఇది ఆగ్రహం తెప్పించినా అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని చేజార్చుకోవడమెందుకని వెంటనే మల్లికార్జునఖర్గేను ఏఐసీసీీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. హైకమాండ్ మాత్రం గెహ్లత్ వర్గం పై గుర్రుగానే ఉంది. హైకమాండ్ కే ఎదురు చెబుతారా? అంటూ నేరుగా ప్రశ్నించకపోయినా ఎన్నికల వేళ కొంత చర్యలు తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మందికి తిరిగి టిక్కెట్ ఇవ్వడం కష్టమేనంటున్నారు. అశోక్ గెహ్లాత్ వర్గంగా తాము నేరుగా చెప్పుకునేందుకు ఏ మాత్రం భయపడని ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్ ఇచ్చి తలనొప్పులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకని హైకమాండ్ అభిప్రాయపడుతుంది. అందుకే ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే ప్రకారం టిక్కెట్లు ఇవ్వాలని, గెహ్లాత్ వర్గాన్ని దూరం పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి చివరకు ఏంజరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News