బ్లాక్ మెయిల్ చేస్తే కష్టమేనట

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు జగన్ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు మొదలయ్యాయి.;

Update: 2021-12-06 02:07 GMT

అధికారంలో ఉన్నవాళ్లు గాజు గదిలో ఉన్నట్లే. బయట నుంచి రాళ్లు విసిరే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అయినా సమర్థంగా తమను తాము కాపాడుకుంటూ ప్రజల్లో నమ్మకం కల్గించాలి. ఇప్పుడు జగన్ ముందున్న ప్రాబ్లెం కూడా అదే. జగన్ తనంతట తానే సమస్య కొని తెచ్చుకుంటున్నారా? లేక అవే వచ్చి మీదపడుతున్నాయా? అన్నది పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. కానీ జగన్ మాత్రం వాటినేటిని సమస్యలుగా చూడటం లేదు. ఒక్క విషయం మాత్రం నిజం. జగన్ విషయంలో ఎవరైనా కొంత దిగి ఉండాలి. లేకుంటే వారు ఆశించినవి కూడా దక్కవు.

సంఘాల్లో భిన్నాభిప్రాయాలు...
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అదే భయపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల్లో మరీ ఎఫెన్స్ లో వెళ్లవద్దని, అసలుకే మోసం వస్తుందని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎగ్రసివ్ గా వెళుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో కూడా విభేదాలు తలెత్తే అవకాశముంది. జగన్ సంగతి ఉద్యోగ సంఘ నేతలకు తెలియంది కాదు. బతిమాలి తెచ్చుకోవాలే కాని బ్లాక్ మెయిలింగ్ జగన్ దగ్గర కుదరదు.
కూల్చేస్తామని వార్నింగ్ తో...
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మె విషయంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నాయి. మరోవైపు కొందరు ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకుందామంటున్నారు. ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు అయితే ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. ఆ శక్తి తమకుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో కొందరు నేతలు కంగారు పడిపోయారు.
రేపటి నుంచి ఆందోళనలు...
ఇలాంటి వ్యాఖ్యలకు చోటివ్వవద్దని ఆయనకు హెచ్చరించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బండి శ్రీనివాసరావు ఒక పార్టీకి వత్తాసుగా మాట్లాడారని స్పష్టమవుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో అంత సదభిప్రాయం లేదు. ఒక వేళ సమ్మెకు దిగినా ప్రజల నుంచి వ్యతిరేకతను ప్రభుత్వం కంటే ఉద్యోగులే ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్ పది రోజులలో పీఆర్సీ పై స్పష్టత ఇస్తామని ప్రకటించారు. పట్టుదలకు పోకుండా వేచి చూడాలని కొందరు అంటుండగా, నోటీసు ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఆందోళనలు చేద్దామని ఉద్యోగ సంఘాల్లో మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రేపటి నుంచి ఉద్యోగ సంఘాల ఆందోళనలు ప్రారంభం కానున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News